పాస్తా తినే మహిళలకు శుభవార్త
లండన్: ఇటాలియన్ ఫేమస్ వంటకమైన పాస్తా మీరు తింటున్నారా... అయితే పాస్తా ప్రేమికులకు, ముఖ్యంగా మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. పాస్తా తింటే ఊబకాయం రాదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాదు ఊబకాయం మన దరిచేరకుండా చేస్తుందని వెల్లడించారు. ఇటలీ సంస్థ ఐఆర్‌సీసీఎస్ న్యూరోమెడ్ శాస్త్రవేత్తలు సుమారు 23 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
పాస్తాను నిత్యం ఆహారంగా తీసుకునే వారు బరువు పెరగలేదని, వారిలో ఊబకాయ సమస్య కూడా తలెత్తలేదని శాస్త్రవేత్తల్లో ఒకరైనా జార్జ్ పునిస్ తెలిపారు. పాస్తా తినేవారు ఆరోగ్యంగాను, సన్నని నడుముతోనూ ఉన్నారని పునిస్ పేర్కొన్నారు. బరువు పెరిగె అవకాశాలు ఉంటాయని అపోహపడి చాలా మంది మహిళలు పాస్తా అంటే ఎంతో ఇష్టం ఉన్నా, చాలా సందర్భాలలో నోరు కట్టేసుకుని ఉండాల్సి వస్తోంది. పాస్తా తింటే బరువు పెరుగుతామని చాలా మంది అపోహ పడతారని, అందులో నిజం లేదని ఐఆర్‌సీసీఎస్ పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయనంలో తేలిన విషయాలను ఇటీవల విడుదలైన న్యూట్రీషియన్, డయాబెటిస్ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు.