భూతల స్వర్గంగా గూగుల్‌ ఆఫీస్‌! | Google employees enjoy free amenitys at work | Sakshi
Sakshi News home page

భూతల స్వర్గంగా గూగుల్‌ ఆఫీస్‌!

Published Wed, Jul 5 2017 7:24 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

భూతల స్వర్గంగా గూగుల్‌ ఆఫీస్‌! - Sakshi

భూతల స్వర్గంగా గూగుల్‌ ఆఫీస్‌!

లండన్‌:
ఉద్యోగం చేసే చోటునే శరీర వ్యాయామానికి కావాల్సిన జిమ్ము, స్మిమ్మింగ్‌ ఫూల్, ఆకలేస్తే రుచికరమైన భోజనం, అలసిపోయి నిద్రొస్తే కునుకుతీసేందుకు మెత్తటి పరుపు, లేవగానే ఒళ్లు బడలికగా ఉంటే వళ్లు పట్టేందుకు మసాజ్‌ సెంటర్లు, సాయంత్రం బోరు కొడితే ఉల్లాసానికి గోల్ఫ్, కావాల్సినప్పుడు రకరకాల కాఫీలు...లాంటి సౌకర్యాలుంటే మనం ఏమంటాం. ‘ఆహా! భూతల స్వర్గం. ఓ ఉద్యోగికి ఇంతకన్నా ఏం కావాలి?’ అంటాం. ఇలాంటి భూతల స్వర్గాన్ని ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థ ‘గూగుల్‌’ తన ఉద్యోగుల కోసం త్వరలో సృష్టించబోతోంది. ఈ సౌకర్యాలన్నీ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పైగా మంచి జీతం కూడా చెల్లిస్తుంది.

ఇలా ఉద్యోగుల ఉల్లాసానికి కావాల్సిన సకల సౌకర్యాలతో గూగుల్‌ సంస్థ లండన్‌లో 11 అంతస్తులతో 300 మీటర్ల పొడవైన భారీ భవనాన్ని నిర్మించనుంది. ఇప్పటికే ఈ భవనం డిజైన్‌ ఖరారైందని, వచ్చే ఏడాది నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని యాజమాన్యం వెల్లడించింది. జిమ్‌లు, స్నూకర్‌ గేమ్‌లు, బాస్కెట్‌ బాల్‌ కోర్టులు లాంటి సౌకర్యాలను గూగుల్‌ సంస్థ ఇప్పటికే తమ ఉద్యోగులకు కల్పిస్తుండగా, వాటికి అదనంగా లండన్‌ ప్రధాన కార్యాలయంలో సౌండ్‌ ప్రూఫ్‌ స్లీప్‌ పాడ్స్, ఒలింపిక్స్‌ సైజులో మూడు లేన్ల స్మిమ్మింగ్‌పూల్‌ను, మేడ మీద గోల్ఫ్‌ కోర్టును, జుత్తు కత్తిరించే హేర్‌ సెలూన్లను, 24 గంటలు పనిచేసే మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. భిన్న రుచుల రెస్టారెంట్‌ ఎలాగు ఉంటుంది.

ఉద్యోగులకు ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు గూగుల్‌ సంస్థలో ఉద్యోగం దొరకడం కష్టమే, అందులో నుంచి బయటపడడమూ కష్టమేనని కొంత మంది ఉద్యోగులు వ్యాఖ్యానిస్తుండగా, ఉద్యోగులను బానిసల్లాగా 24 గంటపాటు ఆఫీసులోనే ఉంచుకునేందుకే కంపెనీ ఇలాంటి ఏర్పాట్లను చేస్తోందని మాజీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇక యాజమాన్యం చెప్పినప్పుడు జుట్టు కత్తిరించుకోవాలని, కష్టపడి పనిచేసేందుకు కసరత్తు చేయాలని, ఎప్పుడు పడుకోవాలో, ఎన్ని గంటలు పడుకోవాలో కూడా ఇక యాజమాన్యమే చెబుతుందని వారంటున్నారు. ఇది ఓ ఉద్యోగికి వినోదం పేరిట ఎప్పుడూ ఒకే పాట వినిపించినట్లు ఉంటుందని కూడా వారంటున్నారు.

వీరి మాటల్లోని వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే ఉద్యోగులకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం వల్ల వారి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందన్నది యాజమాన్యం ప్రాక్టికల్‌ నేర్చుకున్న పాఠం అనడంలో సందేహం లేదు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఆఫీసులోకి మేనేజర్‌ సాదరంగా ఆహ్వానిస్తే ఆ ఉద్యోగి ఉత్పత్తి 15 శాతం అభివద్ధి చెందుతుందన్నది గూగుల్‌ హెచ్‌ఆర్‌ విభాగం విశ్వాసం. అసలు ఈ విభాగాన్నే కంపెనీ ‘పీపుల్‌ ఆపరేషన్‌’గా వ్యవహరిస్తుంది. ఇందులో పనిచేసే వారిని ‘పీపుల్‌ అనలిస్ట్స్‌’ అంటారు. వీరు ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫిట్‌నెస్‌ను, మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటుంటారు. వివరాలను నమోదు చేసుకుంటారు. అభిరుచులను కూడా అంచనా వేస్తారు. ఇలా ఉద్యోగుల ఫిట్‌నెస్, అభిరుచుల గురించి తెలుసుకునేందుకు గూగుల్‌ హెచ్‌ఆర్‌ విభాగం 2012లో ‘అరిస్టాటిల్‌’ కోడ్‌ నేమ్‌తో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు పనిచేసే పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చింది.

రొటీన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు కొంత కాలానికి బోర్‌ కొడతాయి. అలాంటి చోట్ల సంచార వాహనాల (కారవాన్స్‌)రూపంలో సమావేశం హాళ్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులు సేదతీరేందుకు హాట్‌ స్టీమ్‌ టబ్బులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు లండన్‌లో నిర్మిస్తున్న ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు కునకుతీసేందుకు ఏకంగా 5,000 స్లీప్‌ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఉద్యోగులు త్వరగా ఉపశమనం పొందటానికి వీలుగా తలవైపు గ్రావిటీ తక్కువగా ఉండేందుకు కాళ్లవైపు ఎత్తుగాను, తలవైపు కిందకు ఉండేలా స్లీప్‌ ప్యాడ్స్‌ను రూపొందించింది. చివరకు నిద్ర కూడా ఉద్యోగుల ఇష్టానుసారం పోనివ్వరా అంటూ విమర్శిస్తున్నవారు ఉన్నారు. ఈ కొత్త ప్రధాన కార్యాలయంలో ఏడువేల మంది ఉద్యోగులు పనిచేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement