
ఆరువేల కోట్లతో గూగుల్-యాపిల్ 'సెర్చ్' డీల్!
సాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. ఐఫోన్ మొబైల్ కంపెనీ యాపిల్‌కు అక్షరాల ఒక బిలియన్ డాలర్లు (రూ. 6,757 కోట్లు) ముట్టజెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. యాపిల్‌కు చెందిన ఉత్పత్తుల్లో తమ 'గో టు సెర్చ్' టూల్‌ను డిఫాల్ట్‌గా అమర్చేందుకు 2014లో ఈ సొమ్మును గూగుల్ అందజేసిందని 'బ్లూమ్‌బర్గ్' కోర్టు పత్రాలను ఉటంకిస్తూ వెల్లడించింది.
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇటు గూగుల్ కానీ, అటు యాపిల్ కానీ సాధారణంగా బహిర్గతం చేయవు. ఈ నేపథ్యంలో ఒరాకిల్ సంస్థకు చెందిన న్యాయవాది గతవారం సాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో విచారణ సందర్భంగా ఈ అరుదైన వివరాలు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు మాత్రం వెల్లడికాలేదు. 'ఆల్పాబెట్' కార్పొరేట్ కంపెనీలో భాగమైన గూగుల్ సంస్థ కేవలం ఐఫోన్లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ మొత్తాన్ని ముట్టజెప్పిందని ఒరాకిల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని ఒరాకిల్ అసంబద్ధంగా వ్యవహరిస్తున్నదని, ఇది సరికాదని గూగుల్ ఈ కేసులో పేర్కొంది.
ఆండ్రాయిడ్ విభాగం ద్వారా గూగుల్ సంస్థ 22 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందన్న విషయాన్ని కూడా గతవారం జరిగిన కోర్టు విచారణలో ఒరాకిల్ న్యాయవాది వెల్లడించారు. 2008లో ఆవిష్కరించిన ఆండ్రాయిడ్ స్టాఫ్‌వేర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 80శాతం స్మార్ట్‌ఫోన్లలో వినియోగిస్తున్నారు. అయితే ఒరాకిల్ తయారుచేసిన జావా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన మౌలిక కాపీరైట్ అంశాలను ఆండ్రాయిడ్ రూపకల్పనలోవాడుకున్నారని గూగుల్‌పై ఆ సంస్థ దావా వేసింది. చాలాకాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణ రహస్యంగా సాగుతోంది.