మూడేళ్ల చిన్నారికి గొరిల్లా పాఠం
న్యూయార్క్: గొరిల్లాను దూరం నుంచి చూస్తేనే ఒళ్లంతా జలదరించిపోతుంటుంది. అలాంటిది నిజంగా ముఖంలోకి ముఖంపెట్టి చూస్తే.. అది కూడా ఓ మూడేళ్ల చిన్నారి ఆ సాహసం చేస్తే. ఆ చిన్నారిని చూసి ముచ్చటపడిన గొరిల్లా కూడా తనకు తెలిసిన విద్యలు నేర్పిస్తే.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. అవును ఒహియోలోని కొలంబస్ జూ వద్ద ఇదే ఘటన ఆవిష్కృతమైంది. రైలీ మాడిసన్ అనే మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జూ పార్క్కు వెళ్లింది.
అక్కడ ఉన్న గొరిల్లా దగ్గరకు వెళ్లి హాయ్ అన్నట్లుగా ముఖంలోకి ముఖంపెట్టి చూసింది. ఆ తర్వాత ఆ గొరిల్లా తన మధ్య వేలిని చూపుడు వేలిగా చూపిస్తూ ఆ పాపను కూడా అలాగే చేయమన్నట్లుగా హావభావాలతో చెప్పడంతో ఆ పాప కూడా అలాగే చేసింది. తన మధ్య వేలినే చూపుడు వేలుగా చూపిస్తూ తనకు గొరిల్లా ఆ విషయం చెప్పిందన్నట్లు తల్లితో చెప్పింది. అప్పటి నుంచి పదే పదే అదే వేలును చూపుడు వేలిగా చూపెడుతూ ముచ్చటపడుతుండటంతో.. 'తప్పు నువ్వు గొరిల్లాను అనుసరించ కూడదు. చూపుడు వేలు అది కాదు ఇది' అంటూ అసలైన చూపుడు వేలు చూపిస్తూ ముద్దుచేసింది. అలా తొలిసారి, మధ్య వేలిని కూడా చూపుడు వేలిగా చూపించవచ్చని ఆ చిన్నారి గొరిల్లా వద్ద పాఠాలు నేర్చుకుంది.