ఈ చిత్రంలో కనిపిస్తున్న గొరిల్లా తీక్షణంగా చూస్తున్న వస్తువు ఏమిటబ్బా అని అనుకుంటున్నారా? ఇదో రైస్ కేక్. బియ్యం, వెన్న, పలు రకాల పండ్లు, కూరగాయలతో దీన్ని తయారు చేశారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న ఓ జూలో ఫటో అనే ఈ ఆడ గొరిల్లా ఆరగించేందుకు ఇలా తెచ్చిపెట్టారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఉందిలేండి.. తాజాగా ఈ గొరిల్లా 65 ఏళ్లు పూర్తి చేసుకుంది మరి! ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ గొరిల్లాగా ఇది రికార్డులకెక్కింది.
పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొనే కేక్‌పై ఎరుపు, నలుపు రంగులతో కూడిన జెమ్స్‌ను 65 అంకె ఆకారంలో ఉంచారు. ఇన్ని పదార్థాలతో చేసిన కేక్‌ను కళ్లెదుట ఉంచితే గొరిల్లా ఊరుకుంటుందా? పిసరంత కూడా మిగల్చకుండా మొత్తం కేక్‌ను గుటుక్కుమనిపించింది. జూ నిర్వాహకుల కథనం ప్రకారం పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో 1957లో పుట్టిన ఈ గొరిల్లాను ఫ్రాన్స్‌కు చెందిన ఓ నావికుడు తన దేశానికి తీసుకెళ్లాడు.
1959లో దీన్ని జర్మనీ తీసుకొచ్చిన అతను.. మద్యానికి నగదు లేక గొరిల్లాను ఇచ్చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ గొరిల్లా జూలోనే జీవిస్తోంది. అడవుల్లోని గొరిల్లాల జీవితకాలం సుమారు 40 ఏళ్లు ఉంటుందని, జూలో ఉంటుండటంతో ఫటో ఇంత దీర్ఘకాలంపాటు జీవించగలుగుతోందని జూ నిర్వాహకుడు క్రిస్టియన్ ఆస్ట్ పేర్కొన్నాడు. వృద్ధాప్యం మీదపడ్డా నేటికీ ఫటో ఎంతో ఆరోగ్యంగా ఉందని, ఆకలి మందగించడం వంటి సమస్యలేవీ దీనికి లేవని చెప్పాడు. సుమారు 200 కేజీల బరువు ఉండే గొరిల్లాలు రోజూ 15 నుంచి 20 కిలోల వరకు గడ్డి, ఆకులు, బెరళ్లు, పండ్లు ఆరగిస్తాయని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment