హాలీవుడ్ ఛేజింగ్‌ను మైమరపించేలా!
హీరో వెంట విలన్లు పడుతుంటారు. హీరో వాళ్లను అక్కడినుంచి దూరంగా తీసుకెళ్లడానికి పరుగు పెడుతుంటాడు. గల్లీల్లో దూరి, బండ్ల మీదకు ఎగురుతూ ఎలాగోలా వాళ్ల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా ఛేజింగ్ మనం చూస్తుంటాం. కొండలు, గుట్టలు దాటుకుని మరీ విలన్లను ఒక ఆట ఆడించడం అక్కడి హీరోలకు వెన్నతో పెట్టిన విద్య. సరిగ్గా అదే తరహాలో.. పదుల సంఖ్యలో పాములు వెంబడిస్తున్నా, వాటి బారి నుంచి ఉడుము ఎలా తప్పించుకుందన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీలలో రెండు నిమిషాల కేటగిరీలో అత్యంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉన్న వీడియో ఇదేనని ప్రస్తుతం అంటున్నారు.
సాధారణంగా ఉడుము అనగానే దాని పట్టు గుర్తుకొస్తుంది. పట్టుకుంటే ఒక పట్టాన విడిచిపెట్టని తత్వం దానిది. కానీ, అదే సమయంలో కావాలనుకుంటే ఎలాగైనా జారిపోయి, తప్పించుకోగల సామర్థ్యం కూడా దానికి ఉందని ఈ వీడియోలో తెలుస్తోంది. నల్లటి కొండరాళ్లలో దాదాపు ఏడు అడుగుల పొడవున్న పాములు దాగి ఉంటాయి. ఆ పర్వతపాద ప్రాంతంలో ఒక ఉడుము వెళ్తూ ఉంటుంది. ఒక పాము ఏమీ తెలియనట్లుగా దానికి దూరంగా వెళ్లి, దాని పక్కనుంచే వెళ్లిపోతుంది. అక్కడే ఆగిపోయిన ఉడుము.. అది ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది. కానీ ఈలోపు వెనక నుంచి వచ్చిన మరో పాము ఉడుము తోకను పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. అక్కడి నుంచి అసలైన ఛేజింగ్ మొదలవుతుంది. దాన్నుంచి తప్పించుకున్న ఉడుము వేగంగా పరుగులు పెడుతుంటే, కొండ గుట్టల్లోంచి కొన్ని పదుల సంఖ్యలో ఒక్కసారిగా పాములు జరజరా ముందుకొచ్చి, ఆ ఉడుము మీద మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.
వాటన్నింటి నుంచి కూడా అత్యంత చాకచక్యంగా తప్పించుకునే ఆ ఉడుము, కొండ ఎక్కేయాలని ఒక బండ రాయి వద్దకు చేరుకుంటుంది. ఈలోపు అక్కడే బండరాళ్లలో దాగున్న మరికొన్ని పాములు ఒకేసారి దాన్ని చుట్టుముట్టి, శరీరాన్ని చుట్టేస్తాయి. ఇక ఉడుము పని అయిపోయింది.. దొరికేసిందే అనుకుంటున్న తరుణంలో మళ్లీ అక్కడి నుంచి జారిపోయి తప్పించుకుని కొండపైకి ఎక్కేస్తుంది. మధ్యలో కూడా పాములు చిట్టచివరిక్షణం వరకు ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. చివరకు ఉడుము కొండ శిఖరం మీదకు వెళ్లి, అక్కడ ఉన్న తన మరో స్నేహితుడిని కలిసి విజయగర్వంతో ఒక్కసారి పైకి చూస్తుంది!