
అఫ్గాన్ ఆపరేషన్ సక్సెస్
* ఉగ్రవాదులందరూ హతం
* అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడిని తిప్పికొట్టిన భద్రతాదళాలు
* ఉగ్రదాడిని సమర్ధంగా ఎదుర్కొన్న ఐటీబీపీ, అఫ్గాన్ నేషనల్ పోలీస్
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లోని మజర్ ఇ షరీఫ్ పట్టణంలో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. దాదాపు 25 గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతమైంది.
భారత దౌత్య కార్యాలయం ఉన్న భవనంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదివారం రాత్రే భద్రతాదళాలు అంతమొందించగా.. పక్కనే భవనంలో దాగి, కాల్పులు, గ్రెనేడ్ దాడులకు పాల్పడిన మిగతా వారిని సోమవారం హతమార్చారు. ఆపరేషన్ పూర్తయినట్లు అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించిందని భారతీయ అధికార వర్గాలు తెలిపాయి. టైస్టులందరినీ హతమార్చామని మజర్ ఇ షరీఫ్‌లోని పోలీస్ ఉన్నతాధికారి సయ్యద్ కమల్ సాదత్ ప్రకటించారు.
ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. ఈ దాడిలో ఒక పోలీస్ చనిపోయాడని, 11 మంది గాయపడ్డారని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో భారత రాయబార కార్యాలయం ఉన్న ఐదంతస్తుల భవనంపైకి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. పక్కనే ఉన్న భవనం నుంచి రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలతో ముప్పేట దాడిని కొనసాగించారు.
దౌత్యకార్యాలయానికి రక్షణగా ఉన్న సుశిక్షిత ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కమెండోలు తక్షణమే స్పందించి, ఎదురు దాడి ప్రారంభించారు. అనంతరం అఫ్గాన్ జాతీయ పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్ర మూకలను తుదముట్టించే ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య చాలా సేపు పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగాయి. దౌత్య కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముష్కరులను తుదముట్టించారు. ఉగ్రవాదులు దాగిన ఐదంతస్తుల భవనంపైకి హెలీకాప్టర్ ద్వారా దిగిన కమెండోలు ఒక్కో అంతస్తును జల్లెడబట్టి, మిగతా టైస్టులను కూడా అంతమొందించారు.
ఈ ఆపరేషన్ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. భారత దౌత్య కార్యాలయంపైకి ఉగ్రవాదులు రాకెట్ ద్వారా ప్రయోగించిన దాదాపు 7 గ్రెనేడ్లు కొద్దిలో లక్ష్యాన్ని తప్పాయి. ఐదుగురు, లేదా ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొని ఉండొచ్చని భద్రతావర్గాలు భావిస్తున్నాయి. భారత కాన్సులేట్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని తెలిపాయి.
మోదీకి ఘనీ ఫోన్: మజర్ ఇ షరీఫ్‌పై ఉగ్రదాడి ఘటన వివరాలను అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ భారత ప్రధాని మోదీకి వివరించారు. సోమవారం మోదీకి ఫోన్ చేసిన ఘనీ.. పఠాన్‌కోట్‌లో జరిగిన సీమాంతర ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రదాడిని సమర్ధంగా తిప్పికొట్టిన అఫ్గాన్ జాతీయ భద్రతా బలగాలను ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. అఫ్గాన్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి
కాబూల్‌లోని విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో సోమవారం ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దాడిలో మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. కానీ విమానాశ్రయానికి వెళ్తున్న విదేశీ భద్రతా దళాల వాహన శ్రేణి లక్ష్యంగా ఆ దాడి జరిగిందని భావిస్తున్నారు. కాబూల్‌లోనే జరిగిన మరో ఘటనలో కారుబాంబు పేలుడు సంభవించింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, అమెరికాల మధ్య చర్చలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ నెల 11న పాకిస్తాన్‌లో మొదటి రౌండ్ చర్చలు జరగనున్న నేపథ్యంలో.. అఫ్గాన్‌లో ఉగ్ర బీభత్సం ఊపందుకోవడం గమనార్హం.