వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా అతలాకుతలం అవుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచం ఆర్ధిక మాంద్యం వైపు పరుగులు తీస్తోంది. దీంతో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా పై అమెరికాలో పనిచేస్తున్న వారు ఉద్యోగం కోల్పొతే తమ వీసా గడువును ప్రస్తుతమున్న 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలని ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
టెక్నికల్ సహాయం కోసం కొంతమంది ప్రొఫెషనల్స్‌ని కంపెనీలు అమెరికాకు పిలిపించుకొని పనిచేయించుకుంటాయి. అటువంటి వారు హెచ్-1బీ వీసాపై వచ్చి అమెరికాలో కొంత కాలం పనిచేసి వారి దేశాలకు తిరిగి వెళతారు. అయితే కరోనా విజృంభించిన కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న వారే ముందు వరుసలో ఉన్నారని పలు కంపెనీలు ఇప్పటికే వారి ఉద్యోగులకు సంకేతాలు ఇచ్చాయి. సాధారణంగా హెచ్-1బీ వీసా పై వెళ్లిన వారు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం పొందక పోతే వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది.
అయితే కరోనా కారణంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించి అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేశాయి. అదేవిధంగా ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ విదేశాల నుంచి కూడా ఎవరిని వారి దేశానికి రానివ్వడం లేదు. హెచ్-1బీ వీసాపై వెళ్లిన వారిలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. అయితే హెచ్-1బీ వీసా ఉండి ఉద్యోగం కోల్పోయిన వారు నిరుద్యోగులకు ప్రభుత్వం అందించే ఏ ప్రయోజనాలు పొందలేరు. అదేవిధంగా వారి జీతం నుంచి ప్రతి నెల సామాజిక భద్రత ప్రయోజనాల కోసం కొంత మొత్తం కట్ అవుతున్నా ఈ సమయంలో అవి కూడా వారికి అందించరు. కరోనా ఎఫెక్ట్ కారణంగా అమెరికాలో 47 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే హెచ్1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ చాలా మంది అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ విషయంపై వైట్‌హౌస్ నుంచి స్పందన రావాలంటే లక్షల మంది పిటిషన్ ఇవ్వాలి. ఇప్పటికే దీనికి సంబంధించి 20,000 లకు పైగా సంతకాలు స్వీకరించారు. ట్యాక్స్‌ల రూపంలో హెచ్1బి ఉద్యోగులు ఐటీ కంపెనీలకు అండగా నిలుస్తున్నారు. ఈ కష్టకాలంలో తమకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7,82,365 కరోనా కేసుల నమోదు కాగా 37,582 మంది చనిపోయారు. అమెరికాలో అత్యధికంగా 1,61,807 కరోనా కేసులు నమోదయ్యాయి. (హెచ్-1బీ వీసా : పరిమితి ముగిసింది)
Comments
Please login to add a commentAdd a comment