
లండన్ : బ్రిటీష్ రాజకుటుంబం బాధ్యతల నుంచి తప్పుకున్న హ్యారీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని పబ్లిక్ చేస్తున్నారని అన్నారు. తన భార్య మేఘన్ మోర్కెల్, 8 నెలల కుమారుడు ఆర్కీ ఫొటోలను ప్రచురించిన సన్, డెయిలీ మెయిల్ దినపత్రికలపై న్యాయపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు హ్యారీ తరపు న్యాయవాది సదరు వార్తా పత్రికలకు నోటీసులు జారీ చేశారు. కాగా, కుమారుడు ఆర్కీతో కలిసి మోర్కెల్ కెనడాలోని వాంకోవర్ దీవిలోని రీజనల్ పార్క్‌లోకి అడుగుపెట్టారు. రాజ సంరక్షకులు చివరిసారిగా తోడు రాగా.. భుజానేసుకున్న జోలిలో ఆర్కీ, ముందు రెండు పెంపుడు కుక్కలతో కలిసి మోర్కెల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే ఇంటికి చేరుకున్నారు. అయితే, ఈ ఫొటోలన్నీ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
(చదవండి : రాజదంపతుల కొత్త జీవితం!)
మోర్కెల్ అనుమతి లేకుండా.. సదరు ఫొటోగ్రాఫర్లు దొంగచాటుగా ఫొటోలు తీశారని హ్యారీ చెప్పుకొచ్చారు. కెమెరాలకు, మీడియాకు దూరంగా ఉండాలనే రాజ కుటుంబం నుంచి తప్పుకున్నామని హ్యారీ మరోసారి స్పష్టం చేశాడు. తమ అనుమతి లేకుండా వాంకోవర్ దీవిలోని తమ ఇంటిని ఫొటోలు తీసిన వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కెమెరా ‘క్లిక్’మన్నప్పుడల్లా.. తన తల్లి చావే గుర్తుకు వస్తుందని ఈ సందర్భంగా హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రిన్స్ హ్యారీ తల్లి, వేల్స్ యువరాణి డయానా 1997లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. మీడియా కంటబడకుండా తప్పించుకునే క్రమంలో ఆమె ప్రమాదం బారిన పడ్డారు.
(చదవండి : మేఘన్ రాజ వంశాన్ని చులకన చేసింది)
Comments
Please login to add a commentAdd a comment