తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఛాందసవాదులు మూసపోసిన రీతిలో స్పందించారు. ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్య పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ-ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఇదే అలవాట్లను మనం గుర్తించకపోతే, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నవారిమవుతాం.
బ్రిటన్ రాజరికం జాతివివక్షా భావాలతో నిండిపోయి ఉందంటూ ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వూ్యలో మేఘన్ మర్కెల్, హ్యారీ విండ్‌సార్ ఆరోపించడంతో బ్రిటిష్ రాజరికంపై బాంబు పేలినట్లయింది. ఆ ఇంటర్వూ్యపై వెంటనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే, స్త్రీ ద్వేషం, జాతి వివక్ష బ్రిటిష్ రాజరికంతో ముడిపడి ఉన్నాయి. ఈ వాస్తవాన్ని బ్రిటిష్ మీడియా మరింత సంక్లిష్టం చేసిపడేస్తోంది. హ్యారీ, మేఘన్‌లు నిష్కపటమైన, స్వచ్ఛమైన రీతిలో ఓప్రాకు ఇచ్చిన ఆ ఇంటర్వూ్య మనందరి కళ్లు తెరిపించింది. అది బ్రిటిష్ మీడియాను, పవిత్రమైనదిగా భావించే బ్రిటిష్ రాజ రికాన్ని ప్రకంపింపచేసిందన్నది వాస్తవం.
అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం వివాదం నుంచి బ్రిటిష్ రాణిని జాగ్రత్తగా తప్పించి వేయడమే. రాణి సలహాదారులూ రాచరిక వ్యవస్థే దీనంతటికీ కారణమని మీడియా తేల్చేసింది. యువరాణులు, యువరాజుల జిగేల్‌మనిపించే ఆహార్యం, ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసేటటువంటి డిజైనర్ దుస్తులు, డైమండ్లు, పాపరాజీ వర్ణించే అద్భుతమైన వారి వివాహ గాథలను దాటి ముందుకు చూస్తే, జాతులను, సహజ వనరులను, ప్రపంచవ్యాప్తంగా స్థానికులను కొల్లగొట్టి మరీ సముపార్జించుకున్న క్రూరమైన స్వీయ సంపద విభ్రమ విలాసాలు బ్రిటిష్ రాచరికం సొత్తుగా ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పుడంటే ఆధునిక రాజరికం వాస్తవాధికారం లేని ముదివగ్గును తలపిస్తోంది కానీ ఎలిజబెత్ రాణి పట్ల చెరగని అనుకూలత కారణంగా ఆ గత వైభవాన్ని జనం గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1979లో, బ్రిటిష్-జమైకన్ సాంస్కృతిక సిద్ధాంతకర్త స్టూవర్ట్ హాల్ కాకతాళీయంగా ఇదే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బ్రిటిష్ టెలివిజన్ ప్రసారాల్లో జాతి వివక్ష కొనసాగింపు గురించి మొత్తుకున్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న నల్లజాతి, ఆసియన్ కమ్యూనిటీ ప్రజల పట్ల జాతివివక్షా వైఖరిని సాధారణీకరించేలా వీరి వ్యాఖ్యలు ఉండేవి.
బహుళ జాతి జనాభాతో పెరుగుతూ వచ్చిన బ్రిటన్‌లో జాతి వివక్షా ధోరణులను వ్యాప్తి చేయడానికి హాస్యాన్ని ఎక్కువగా వినియోగించేవారని రచయిత, పరిశోధకురాలు రైనా జేడ్ పార్కర్ తెలిపారు. మీడియా పాక్షిక దృష్టి కారణంగా కలిగిన ప్రభావాలను పరీక్షించడానికి ప్రయత్నించిన స్టూవర్ట్ హాల్ ఇలాంటి ప్రభావం వ్యక్తిగత దాడికిందే పరిగణించాలి తప్ప దీన్ని ఒక వ్యవస్థాగత సమస్యగా భావించవద్దని అప్పట్లోనే చెవ్పేవారన్నారు. వ్యవస్థలో సంస్థాగతంగా జాత్యహంకారం, స్త్రీ ద్వేషం ఉనికిలో ఉన్న విషయాన్ని అంగీకరించడాన్ని తిరస్కరించడానికి ఇది ఒక ప్రామాణిక వంచనాత్మకమైన ఎత్తుగడ అని హాల్ చెప్పారు.
మిశ్రమజాతికి చెందిన మేఘన్ మర్కెల్ బ్రిటన్ యువరాజును అద్భుత గాథలోలాగా పెళ్లాడి, బ్రిటిష్ రాజవంశంలో భాగమైనప్పుడు బ్రిటిష్ టాబ్లాయిడ్లు, ప్రెస్, సామాజిక మీడియా ఫోరంలు ఇదే వివక్షను ప్రదర్శించడం గమనార్హం. పైగా యునైటెడ్ కింగ్‌డమ్ లోని టాబ్లాయిడ్లు, శ్వేత జాతి మీడియా పండితులు, విశ్లేషకులు ఒక పద్ధతి ప్రకారం ఆమెను పొట్టచీల్చి మరీ పేగులు బయటకు లాగేవిధంగా వ్యవహరించారు. మేఘన్ తోటి కోడలు కేట్‌ను ఏడిపించింది! మేఘన్ రాణిమందిరం సిబ్బందిని వేధింపులకు గురిచేసింది! వేధించే పెళ్లికూతురు మేఘన్... ఇలాంటి ఎన్నెన్నో ఆరోపణలతో బ్రిటిష్ మీడియా యువరాణితో ఆటాడుకుంది.
అమెరికన్ టెలివిజన్ దివా విన్ ప్రేకి ఇచ్చిన ఆ సంచలనాత్మక ఇంటర్వూ్యలో మేఘన్, హ్యారీలు ప్రధానారోపణ చేశారు. మేఘన్‌పట్ల అన్యాయంగా ప్రవర్తించింది బ్రిటిష్ మీడియా మాత్రమే కాదనీ, ఆమె నివసించే విండ్‌సార్ మందిరం కూడా ఆమెకు ఏమాత్రం సహాయం చేయలేదని వీరు చెప్పారు. పైగా ఈ వేధింపులో హౌస్ ఆఫ్ విండ్సార్ కూడా అస్పష్టరీతిలో పాల్గొన్నదని మేఘన్ దంపతులు చెప్పారు. ఈ ఆరోపణ బాంబులాగా పేలింది. డయానా గాథలో వెల్లడైన అంశాలు కూడా దీనిముందు సరిపోవని చెప్పాల్సి ఉంటుంది. చరిత్ర తనకు తానే పునరావృతం చేసుకుంటుంది అని హ్యారీ సరిగ్గానే వర్ణించారు. తమ మాతృమూర్తి డయానా తనకు ఎదురైన చేదు అనుభవాల ఫలితంగా ఒంటరితనంలో కూరుకుపోవలసి వస్తే తాము మాత్రం కలిసికట్టుగా తమ సమస్యను పరిష్కరించుకోగలిగినందుకు తామెంతో అదృష్టవంతులమని అందుకు తానెంతో సంతోషపడుతున్నానని హ్యారీ చెప్పారు. ప్రజల అభిమానం చూరగొన్న యువరాణి డయానాను అప్పట్లో వేటాడారు, వెంటాడారు, ఒంటరిని చేసిపడేశారు. అదే సమయంలో ఆమెను ఆరాధించారు, ఆదర్శమూర్తిని చేశారు. అయితే మేఘన్ కూడా డయానా ఎదుర్కొన్న సవాళ్ల బారిన పడినప్పటికీ, అదనంగా తమపై మోపిన జాతివివక్ష, వర్ణవివక్షకు సంబంధించిన భారాలను కూడా మేఘన్ ఎదుర్కొన్నారు.
మధ్యతరగతిలో పుట్టి పెరిగిన మేఘన్ తర్వాత తన సొంత కృషితో, హక్కుతో నటిగా, సోషల్ మీడియా స్టార్‌గా, సెలబ్రిటీగా తన్ను తాను మలుచుకుంది. తన యువరాజుతో కలిసి మరుగుజ్జు శ్వేతజాతి కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు ఈ వివక్షలన్నింటినీ ఆమె అనుభవించింది. మేఘన్ ఎదుర్కొన్న సమస్య సరిగ్గా తన మాతృమూర్తిని వేధించిన పరిస్థితితో సమానమైందని హ్యారీ పేర్కొన్నాడు. అమెరికా, బ్రిటన్ మీడియా ఈ ఉదంతంపై ఊహించిన వైఖరులనే చేపట్టాయి. తమకుతాముగా ప్రవాసంలోకి వెళ్లిన దంపతులపై అమెరికా మీడియా కేంద్రీకరించగా, బ్రిటన్ ప్రెస్ కొన్ని మినహాయింపులను పక్కనబెడితే, తమకెంతో ప్రేమాస్పదమైన రాజకుటుంబంపై ఇన్ని ఆరోపణలు చేస్తారా అంటూ రెచ్చిపోయింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికాలోని ఛాందసవాద వ్యాఖ్యాతలు సైతం మోర్గన్ వంటి రాజరికం సానుభూతిపరులతో జట్టు కలవడమే. రాజమందిరంలోకి ప్రవేశించాక తనకు ఒనగూరేది ఏమిటనేది మేఘన్‌కు కచ్చితంగా ముందే తెలుసని, రాజమందిరంలో ప్రవేశించినందుకు ఆమెకు లభ్యమైన సౌకర్యాలపై, హక్కులపై ఆరోపణలు చేయడానికే వీల్లేదని వీరు వాదిస్తున్నారు. సాధారణీకరించి చెప్పాలంటే, జాతివివక్ష, లైంగిక దోపిడీ, జాతిఆధిక్యతా భావం వంటి అంశాలతో వ్యవహరించడంలో సంస్థాగత మార్పులను చేయాల్సిన అవసరముందని ఉదారవాదులు చేస్తున్న వాదనను అమెరికా, బ్రిటన్‌లోని ఛాందసవాదులు తోసిపుచ్చుతున్నారు. తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై రెండుదేశాల్లోని ఛాందసవాదులు మూసిపోసిన రీతిలో స్పందించడం గమనార్హం.
ఘనత వహించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన ఒకప్పటి పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ–ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం కొల్లగొట్టిన కోహినూర్ వజ్రం వంటి భారతీయ విలువైన సంపదలను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. మరోవైపు ఆ రాజవంశంనుంచి ఎవరైనా సభ్యుడు భారత్ సందర్శిస్తే వారి పాదాలు తాకి పూజిస్తాం. రాజరికం వైభవాన్ని ప్రదర్శించే అన్ని కార్యక్రమాలను కళ్లప్పగించి చూస్తుంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఈ అలవాట్లను మనం గుర్తించి, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఒక్కమాటలో చెప్పాలంటే మనం కూర్చుని ఉన్న అద్దాలమేడను మనం తిరిగి చూడాల్సి ఉంది.
సుమన కస్తూరి
వ్యాసకర్త రచయిత, పరిశోధకురాలు
(ది వైర్ సౌజన్యంతో)
వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ
Published Sat, Mar 13 2021 12:45 AM | Last Updated on Sat, Mar 13 2021 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment