హరికేన్ బీభత్సం.. టెక్సాస్ అతాలాకుతలం
హూస్టన్: హరికేన్ హార్వే ధాటికి టెక్సాస్ విలవిల్లాడుతోంది. ఈ ప్రకృతి విలాపానికి ఐదుగురు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. గంటకు 130 కీ.మీ వేగంతో వీస్తున్న గాలుల కారణంగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కనీసం మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. హూస్టన్, హారిస్‌కౌంటీలలో గత 24 గంటల్లో 30 అంగుళాల మేర వర్షపాతం నమోదైంది.
కొన్ని ప్రాంతాల్లో వంద సెం.మీ వరకు వర్షపాతం నమోదు కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హూస్టన్ మేయర్ సిల్విస్టర్ టర్నర్ హెచ్చరించారు. వచ్చే వారంరోజులూ భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు. హరికేన్ విధ్వంసానికి కుప్పకూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించడానికి రెండు వేల మంది సైనికులను రంగంలోకి దించినట్లు టెక్సాస్ గవర్నరు గ్రెగ్ అబాట్ తెలిపారు. హార్వే ధాటికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహకరించడానికి, కనిపించకుండా పోయినవారిని వెదకడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరో వెయ్యిమంది సహాయక సిబ్బందిని నియోగించినట్లు చెప్పారు.
హార్వే కారణంగా లూసియానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 60 లక్షల మంది హార్వే కారణంగా ఇబ్బంది పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఫోర్ట్ బెండ్ కౌంటీలో 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2004లో హరికేన్ చార్లీ ఫ్లోరిడాలో తన ప్రతాపం చూపిన తరువాత, అమెరికాలో ఈ స్థాయిలో విరుచుకుపడింది హార్వేనే కావడం గమనార్హం. 1961లో హరికేన్ కార్లా కూడా టెక్సాస్‌ను అతలాకుతలం చేసింది.