'బోలెడంత డబ్బు ఇచ్చా.. ఇంకా ఇస్తా'
వాషింగ్టన్: ప్రాథమిక(ప్రైమరీస్) ఎన్నికల ప్రచారానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రచారానికి వ్యక్తిగతంగా భారీ మొత్తంలో సొమ్ము వెచ్చించానని వెల్లడించారు. 'ఎన్నికల ప్రచారం కోసం 100 మిలియన్ డాలర్లు(రూ. 669 కోట్లు)పైగా ఇచ్చాను. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాన'ని సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వ్యక్తిగతంగా మరింత డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.
తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారానికి సొంత డబ్బులు ఇవ్వకుండా విరాళాలపైనే ఆధారపడుతున్నారని ఆక్షేపించారు. హిల్లరీ అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుస్తారన్న భరోసాతో ఆమెకు విరాళాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రైమరీ ఎన్నికల సమయంలో తాను విరాళాలు తీసుకోలేదని, అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాతే పార్టీ గెలుపు కోసం విరాళాలు తీసుకుంటున్నట్టు ట్రంప్ వివరించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఎంత డబ్బు ఇవ్వగలరని ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
'బ్రెగ్జిట్'ను తాను ముందే ఊహించానని, కానీ బయటకు చెప్పలేదని... అలాగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఖాయమని తనకు తెలుసునని ట్రంప్ అన్నారు. హిల్లరీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు.