థైరాయిడ్ ‘తేడా’తో గుండె జబ్బులు
న్యూయార్క్: థైరాయిడ్ గ్రంధి పనితీరులో చిన్నపాటి తేడా ఏర్పడినా తీవ్రమైన హృద్రోగ సమస్యలు తలెత్తవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ తాజా పరిశోధన మేరకు తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లుగా పిలిచే టీఎస్‌హెచ్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టీ4ల స్థాయి ఎక్కువగా, టీ3 స్థాయి తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు గుర్తించారు. టీ4 స్థాయి ఎక్కువైతే గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని నిర్ధారించారు.
ఇందు కోసం మొత్తం 1,382 మంది హృద్రోగ బాధితులపై పరిశోధన చేశారు. టీఎస్‌హెచ్ స్థాయి 7 ఎంఐయు/లీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకుల్లో ఒకరైన భారతీయ శాస్త్రవేత్త లక్ష్మీ కణ్ణన్ చెప్పారు. థైరాయిడ్ పనితీరు మందగించడంతో ఏర్పడే హైపోథైరాయిడిజం వల్ల గుండెకు కృత్రిమ యంత్రాల సాయం అవసరమవచ్చని కొన్ని సందర్భాల్లో మరణం సంభవిస్తుందన్నారు.