
మన ఇంట్లో ఓ బుజ్జి పాపాయి పుడితేనే పేరు పెట్టేందుకు ఎంతగానో ఆలోచిస్తాం. పేర్ల పుస్తకాలు, ఇంటర్నెట్‌లో వెతుకుతాం. నాలుగైదు పేర్లను సెలక్ట్ చేసి, వాటిలో ఏది బాగుందో చెప్పమని అడుగుతాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా మనల్ని అదే అడుగుతున్నారు. అయితే మనం పేరు పెట్టాల్సింది ఏదో బుజ్జి పాపాయికి కాదు. ఓ మరుగుజ్జు గ్రహానికి. గ్రహానికి పేరుపెట్టే అవకాశం ఇప్పుడు మనందరికీ ఉంది. మరి ఆ గ్రహమేదో? పేరెలా పెట్టాలో? తెలుసుకుందాం..
2007 ఓఆర్10... దాదాపు పన్నెడేళ్ల క్రితం శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ బుల్లి గ్రహం. నామకరణ మహోత్సవం జరిపేదాకా పాపాయిని ఏదో ఒక పేరుతో పిలుస్తారు కదా..? అలాగే 2007లో గుర్తించిన ఈ గ్రహానికి 2007 ఓఆర్10 అని పిలుస్తున్నారు. త్వరలో నామకరణ మహోత్సవం జరగనుందన్నమాట. బుజ్జి పాపాయికే పేరు పెట్టేందుకు ఎంతగానో ఆలోచిస్తే... విశ్వం పుట్టినప్పుడే ఆవిర్భవించిన గ్రహానికి పేరు పెట్టాలంటే ఎంతగా ఆలోచించాలి? శాస్త్రవేత్తలు కూడా బాగా ఆలోచించి ఓ మూడు పేర్లను ఫైనల్ చేశారు. వాటిలో నుంచి ఏదో ఒక పేరు పెట్టాలని కోరుతున్నారు. ఎంపికైన పేరును ప్యారిస్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ ఖగోళ సంఘం(ఐఏయూ)కు పంపిస్తారు. ఇంతకీ ఆ మూడు పేర్లేంటంటే...
గుంగ్‌గుంగ్: చైనా నీటి దేవుడు. ఎర్రటి జుట్టు, సర్పం లాంటి తోక ఉంటాయి. వరదలు, బీభత్సం గుంగ్‌గుంగ్ సృష్టేనని చెబుతారు. గుంగ్‌గుంగ్ భూమికి వంపు తీసుకొస్తాడని కూడా అంటారు.
హోలో: ఈమె ఐరోపా శీతాకాల దేవత. సంతానోత్పత్తి, పునర్జన్మ, మహిళలకు సంబంధించిన దేవత.
వీలా: వీలా నోర్డిక్ దేవుడు. మంచు శక్తి వైమిర్‌ను ఓడించి, వైమిర్ శరీరంతో వీలా ఈ విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు.
మరి పేరు పెట్టడమెలా?
ఇప్పుడు పేరు పెట్టాలనుకుంటున్న మరుగుజ్జు గ్రహం ప్లూటో పరిమాణంలో దాదాపు సగం ఉంటుంది. మన సౌరవ్యవస్థలో ఇప్పటివరకు ఏ పేరూ పెట్టని అతిపెద్ద పదార్థం ఈ మరుగుజ్జు గ్రహమే. ఈ మరుగుజ్జు గ్రహం కైపర్ బెల్ట్‌లో ఉంటుంది. దీని వ్యాసం 1247 కిలోమీటర్లు. దీనికి పేరు పెట్టేందుకు నిర్వహిస్తున్న ఓటింగ్ మే 10తో ముగుస్తుంది. ఓటు వేయాలనుకునేవారు https://2007or10.name/index.html#namesను కంప్యూటర్ లేదా మొబైల్‌లో ఓపెన్ చేసి, ఓటు వేయవచ్చు. మరి పేరు పెడతారు కదూ!
Comments
Please login to add a commentAdd a comment