పాక్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ | hindus and muslims live together in pakistan village | Sakshi
Sakshi News home page

పాక్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్

Published Sat, Mar 7 2015 3:42 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

పాక్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ - Sakshi

పాక్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్

పాకిస్థాన్ అంటే మనకు టెర్రరిస్టులే కళ్లముందు కదలాడుతారు. ఆక్కడ మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులపై ముస్లిం ఛాందసవాదులు దాడులు చేస్తున్నారని, వారిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారుస్తున్నారని అప్పుడప్పుడు దేశీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు కూడా ఘోషిస్తుంటాయి. మరోవైపు చూస్తే పాకిస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో  హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలసిమెలసి సహజీవనం సాగిస్తున్నారన్నది అక్షర సత్యం. సింధూ రాష్ట్రంలోని తార్‌పార్కర్ జిల్లాలో మీఠీ అనే చిన్న గ్రామం అలాంటిదే. అక్కడ రంజాన్ వచ్చిందంటే హిందువులంతా ముస్లింలలాగే ఉపవాసం చేస్తారు. మొహర్రం ప్రదర్శనను ముందుండి నడిపిస్తారు. సూఫీ తత్వం ప్రకారం మొహర్రం ప్రదర్శనకు హిందువులే ముందుండాలని ఆ గ్రామ పెద్దలు చెబుతున్నారు. అలాగే మొహర్రం సమయంలో హిందువులెవరూ పెళ్లిళ్లు, పేరంటాలు చేసుకోరు.

రంజాన్, దీపావళి సందర్భంగా ఇరుమతాల వారు స్వీట్లు ఇచ్చి పుచ్చుకుంటూ పరస్పర విశ్వాసాలను పరిరక్షించుకుంటారు. హిందువుల విశ్వాసాలను గౌరవించి మైనారిటీలైన అక్కడి ముస్లింలు ఆవులను వధించరు. వాటి మాంసాన్ని తినరు. అంతేకాకుండా హిందూ దేవాలయల్లో పూజలు జరుగుతున్నప్పుడు మసీదు మైకులు మౌనం పాటిస్తాయి. మసీదు మైకుల్లో నమాజ్ వినిపిస్తున్నప్పుడు గుడిలో గంటలు మోగవు. ఆ ఊర్లో నేరాల సంఖ్య కేవలం రెండు శాతానికి మించదని తార్‌పార్కర్ జిల్లా పోలీసు అధికారులే తెలియజేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ విడిపోయిన నాటి నుంచి వారు ఇలాగే సామరస్యంగా సహజీవనం చేస్తున్నారట. ఇప్పటి వరకు తమ గ్రామంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మత ఘర్షణ జరగలేదని, ఇప్పటికీ టెర్రరిజం ఛాయలు కూడా లేవని ఇరు మతాల పెద్దలు గర్వంగా చెబుతారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా ?
 -డాన్ డాట్ కామ్ సౌజన్యంతో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement