మూడు మతాల పవిత్రం.. వందేళ్ల అగ్ని గుండం | The Holy City of the Three Religions | Sakshi
Sakshi News home page

మూడు మతాల పవిత్ర నగరం.. వందేళ్ల అగ్ని గుండం

Published Sun, Dec 10 2017 5:24 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

The Holy City of the Three Religions - Sakshi

జెరూసలేం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు రగుల్చుతున్న అంశమిది. మూడు మతాలకు అత్యంత పవిత్రమైన ఈ నగరం దాదాపు వందేళ్లుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య పోరు సాగుతోంది. ఐక్యరాజ్యసమితి కల్పించుకున్నా తేలని ఈ వివాదాల తేనెతుట్టెను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కదిలించారు. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తామంటూ ఆయన ప్రకటించడంతో.. పశ్చిమాసియాలో అలజడి రేగింది. ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి ఖండించింది. అసలు జెరూసలేం వివాదం ఏమిటి? ఇప్పుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలేమిటనే అంశాలపై ఈ వారం ‘ఫోకస్‌’..

ఆటోమన్‌ చక్రవర్తుల పాలనలో...
ప్రస్తుత ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్‌ల మధ్య సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం జెరూసలేం నగరం. 1517 నుంచి 1917 వరకు ‘ఆటోమన్‌’ ముస్లిం చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని పాలించారు. జుడాయిజం, ఇస్లాం మతాలకు సంబంధించి పవిత్రంగా భావించే కట్టడాలు, ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్లే ఈ నగరం ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై వందేళ్లుగా వివాదం రగులుతోంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలు ఈ నగరాన్ని తమ రాజధానిగా చేయాలని కోరుకుంటున్నాయి. నగరాన్ని ఇరు దేశాల మధ్య పంచాలని భావించినా.. ఏ విధంగా విభజించాలనేది ప్రధాన సమస్యగా మారింది. 

వందేళ్ల క్రితం..: బ్రిటిష్‌ జనరల్‌ ఎడ్మండ్‌ అలెన్‌బీ వందేళ్ల క్రితం 1917 డిసెంబర్‌ నెలలోనే ఆటోమన్‌ తుర్కు పాలకుల నుంచి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1917–48 మధ్య ఈ ప్రాంతం జెరూసలేం రాజధానిగా బ్రిటిష్‌ పాలనలో ఉండిపోయింది. అప్పటి నుంచి జెరూసలేంపై పట్టు కోసం యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రయత్నించారు. ఆ సమయంలోనే పెద్ద సంఖ్యలో యూదులు జెరూసలేం ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. చివరికి అక్కడే తమ రాజ్యాన్ని స్థాపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ యూదుల వలసలను పాలస్తీనియన్లు వ్యతిరేకించడంతో ఉద్రిక్తత తలెత్తింది. 1947 యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి యూదులు, అరబ్‌లకు చెరో ప్రాంతాన్ని కేటాయిస్తూ.. జెరూసలేంను ‘ప్రత్యేక విదేశ పాలన’ కిందకు తీసుకొచ్చింది. 

అమెరికా దన్నుకు కారణాలెన్నో..
భారీగా చమురు నిల్వలున్న ధనిక దేశం సౌదీ అరేబియా సహా అనేక అరబ్‌ దేశాలతో అమెరికాకు సత్సంబంధాలున్నా.. పాలస్తీనా వివాదంలో ఇజ్రాయెల్‌కే మద్దతుగా నిలవడానికి పలు కారణాలున్నాయి. అమెరికా ప్రజల్లో ఈ యూదు రాజ్యమంటే సానుభూతి ఎక్కువ. ఇజ్రాయెల్‌లో కన్నా అమెరికాలోనే యూదు జనాభా ఎక్కువ. అక్కడి యూదు లాబీ పలుకుబడి ప్రభుత్వ విభాగాలన్నిటికీ విస్తరించింది. మరోవైపు పూర్వపు సోవియట్‌ యూనియన్‌తో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం పరిణామాలు కూడా అమెరికా ఇజ్రా యెల్‌ వైపు మొగ్గేలా చేశాయి. 1956లో సూయజ్‌ కాలువపై ఆధిపత్యం కోసం యుద్ధం జరిగిన సమయంలో.. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌తో కలసి ఈజిప్ట్‌తో తలపడిన ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు లేదు. అయితే పశ్చిమాసియాలో సోవియట్‌ యూనియన్‌ ప్రభావానికి అడ్డుకట్ట వేయడానికి ఇజ్రాయెల్‌ను సాధనంగా వాడుకోవాలన్న అమెరికా నిర్ణయం యూదు రాజ్యానికి కలిసొచ్చింది. 1973లో పొరుగు అరబ్‌ రాజ్యాలు చేసిన మెరుపుదాడి నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడడంలో అమెరికా కీలకపాత్ర పోషించింది. అప్పటి నుంచి అమెరికా–ఇజ్రాయెల్‌ బంధం బలపడింది. 

ఇజ్రాయెల్‌ స్వాతంత్య్రంతో..
1948లో యూదులు ఆటోమన్‌ రాజ్యంలోని కొంత భాగంలో ఇజ్రాయెల్‌ పేరిట స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్‌ విభజన ప్రణాళికను సూచించగా.. అరబ్బులు తిరస్కరించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగి ఓటమి పాలయ్యారు. 1950లో ఇజ్రాయెల్‌ జెరూసలేం పశ్చిమ భాగాన్ని రాజధానిగా ప్రకటించుకుంది. పాతనగరంతో పాటు తూర్పు భాగం జోర్డాన్‌ అధీనంలోకి వెళ్లింది. అయితే ఐక్యరాజ్యసమితి, పాశ్చాత్య దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్‌ తొలుత జెరూసలేంపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఇక్కడి పవిత్ర స్థలాలపై ఎవరికీ నియంత్రణ లేకపోవడమే తమకు కలసి వస్తుందని భావించి ప్రత్యామ్నాయ రాజధానిపై దృష్టి నిలిపింది. చాలా దేశాలు టెల్‌ అవీవ్‌లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే జెరూసలేంపై పట్టుకోసం 1967లో యుద్ధం జరగగా.. ఇజ్రాయెల్‌ మరోసారి అరబ్‌ సైన్యాన్ని ఓడించింది. గాజా స్ట్రిప్‌ను, ఈజిప్ట్‌ నుంచి సినాయ్‌ ద్వీపకల్పాన్ని, జోర్డాన్‌ నుంచి వెస్ట్‌బ్యాంకును, తూర్పు జెరూసలేంతోపాటు సిరియా నుంచి గోలన్‌ హైట్స్‌ను స్వాధీనం చేసుకుంది. తర్వాత చారిత్రక ప్రాధాన్యత రీత్యా జెరూసలేం వైపు మొగ్గి.. 1980లో ఆ నగరాన్ని తమ రాజధానిగా ప్రకటిస్తూ చట్టం చేసుకుంది. 

రెండు దేశాల విధానం!
ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్య సంఘర్షణకు పరిష్కారం కనుగొనే దిశలో గాజా, అధికశాతం వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాలతో పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసి... మిగతా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌కు విడిచిపెట్టేలా ‘రెండు దేశాల’ విధానంపై 1974 ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. అయితే ఆచరణలో దీనిని ఏవిధంగా అమలు చేయాలన్న దానిపై రెండు వర్గాలుగా చీలిపోయాయి. ప్రత్యామ్నాయంగా మొత్తం ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ లేదా పాలస్తీనా పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను కొన్ని వర్గాలు తెచ్చినా... అది ఆచరణ సాధ్యం కాదని మెజారిటీ పరిశీలకులు తేల్చేశారు.

సైద్ధాంతికమే కాదు.. ఆర్థిక బంధం కూడా..
పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్య దేశమైన ఇజ్రాయెల్‌తో అమెరికా బంధం సైద్ధాంతికమేగాక.. బలమైన ఆర్థిక బంధం కూడా. నిండా కోటి జనాభా లేని ఈ చిన్న దేశానికి అమెరికా సాయం 118 బిలియన్‌ డాలర్లు దాటిపోయింది. అంటే సగటున ఏటా మూడు బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.19,000 కోట్లు) మేర అమెరికా నుంచి అందుతున్నాయి. అసలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా వీటో చేసిన తీర్మానాల్లో సగానికిపైగా ఇజ్రాయెల్‌ను అభిశంసిస్తూ చేసినవే. దీనిని బట్టి ఈ రెండు దేశాల మధ్య బంధం ఎంత గాఢమైనదో అంచనా వేయొచ్చు. అసలు అమెరికా తోడ్పాటు లేకుండా అరబ్‌ దేశాల మధ్య ఇజ్రాయెల్‌ ఉనికి సాధ్యమయ్యేది కాదు. బరాక్‌ ఒబామా హయాంలో అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాలస్తీనా భూభాగంలో యూదులకు స్థిర నివాసాల ఏర్పాటు, ఇరాన్‌ వంటి అంశాలపై ఒబామా, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమన్‌ నెతన్యాహూ మధ్య ప్రకటనల యుద్ధం సాగింది.

మూడు మతాలకు పవిత్రస్థానం
క్రైస్తవులు, యూదులు, ముస్లింలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన ప్రాంతాలు జెరూసలేం నగరంలోనే ఉన్నాయి. ఏసుక్రీస్తు మరణం, పునరుత్థానం ఇక్కడే జరిగింది. హిబ్రూ బైబిల్‌లో జెరూసలేం ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ఏసుక్రీస్తు నడయాడిన ఈ ప్రాంతాన్ని, 12వ శతాబ్దంలో నిర్మించిన హోలీ సెపల్క చర్చిని, టెంపుల్‌ ఆన్‌ ద మౌంట్‌ను ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా కింగ్‌ డేవిడ్‌ ఏర్పాటు చేశారని, ఈ నగరంలోనే అతని కుమారుడు సలొమన్‌ తండ్రి పేరిట దేవాలయాన్ని నిర్మించారని హిబ్రూ బైబిల్‌లో రాశారు. 
- ఇక మహ్మద్‌ ప్రవక్త సౌదీ అరేబియా మీదుగా జెరూసలేంకు వచ్చి ఇక్కడి అల్‌– అక్సా మసీదులో ప్రార్థనలు చేయడంతో.. ముస్లింలు ఈ ప్రాంతమంటే ఎంతో భక్తిభావంతో ఉంటా రు. ఖురాన్‌లో పొందుపరిచిన మేరకు మహ్మద్‌ ప్రవక్త స్వర్గలోక యాత్రకు ముందు చివరిసారిగా జెరూ సలేం సందర్శించారని, ఏడో శతాబ్దంలో దేవుడి తో సంభాషించాడని, మక్కా మీదుగా జెరూసలేం చేరుకున్నారని పేర్కొన్నారు. 
- జుడాయిజం (యూదుల మతం) మూల పురుషుడు అబ్రహం వేల ఏళ్ల క్రితమే దేవుడికి తన కుమారుడు ఐజాక్‌ను త్యాగం చేసేందుకు సిద్ధమైన ప్రాంతం జెరూసలేం అని చెబుతారు. తమ దేవుడు తన పేరిట జెరూసలేంను ఏర్పాటు చేసినట్లుగా అబ్రహం మనవడు జాకబ్‌ (తన పేరును ఇజ్రాయెల్‌గా మార్చుకున్నాడు) గుర్తించినట్లుగా డ్యుటెరొనోమి పుస్తకంలో పేర్కొన్నారు. 

ట్రంప్‌ రాకతో ఇజ్రాయెల్‌పై పెరిగిన అమెరికా ప్రేమ!
కిందటేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌ తాను యూదు వ్యతిరేకి అన్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టారు. సనాతన అమెరికా యూదు కుటుంబంలో పుట్టిన పెద్దల్లుడు జారెడ్‌ కష్‌నర్, కుమార్తె ఇవాంకాల తోడ్పాటుతో యూదు ఓటర్లు, లాబీ మద్దతు కూడగట్టి విజయం సాధించారు. ట్రంప్‌ అధికారం చేపట్టాక వైట్‌హౌస్‌ సీనియర్‌ సలహాదారుగా నియమితుడైన కష్‌నర్‌ పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం దిశగా రాయబారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో సౌదీ యువరాజు సల్మాన్‌కు ట్రంప్‌ అల్లుడు దగ్గరయ్యారు. జెరూసలేంపై ట్రంప్‌ నిర్ణయం వెనుక అల్లుడి హస్తం ఉందనీ.. దీనిపై సౌదీ పాలకుల అభ్యంతరాల్లో నిజాయితీ లేదని కూడా దౌత్యవర్గాలు చెబుతున్నాయి.

అరబ్‌ దేశాల నుంచి అమెరికాకు ఇబ్బందేమీ ఉండదా? 
ఎన్నికల హామీల్లో భాగంగానే జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించినట్టు అమెరికా చెబుతున్నా.. టెల్‌ అవీవ్‌ నుంచి ఎంబసీ తరలింపు ఇప్పట్లో జరగదని అర్థమౌతోంది. ఇంకా రెండేళ్లకుగానీ ఆ పని పూర్తవదని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్‌సన్‌ చెప్పారు. అదీగాక ప్రధాన అరబ్‌ దేశాలైన సౌదీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఈజిప్ట్‌లు స్థానిక ప్రయోజనాలు ఆశించి ఇజ్రాయెల్‌కు దగ్గరైన సమయంలో ట్రంప్‌  నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లోపాయికారీ అవగాహనతో నడుస్తున్నాయి. జెరూసలేంపై అమెరికా నిర్ణయం వాస్తవానికి అరబ్‌ దేశాలకు దిగులు పుట్టించే అంశమే కాదని పశ్చిమాసియా నిపుణులు తేల్చిచెబుతున్నారు. అమెరికా ఎంబసీ తరలింపు ఎప్పుడు జరిగినా ట్రంప్‌ ప్రకటనతో పశ్చిమా దేశాల నుంచి అగ్రరాజ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని కూడా విశ్లేషిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement