చారిత్రక జెరూసలెం నగరం
వాషింగ్టన్: ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖను ట్రంప్ ఆదేశించారు.
‘జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఇదే సమయమని నేను నిర్ణయించాను’ అని ట్రంప్ అన్నారు. ఈ పనిని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ‘ఏదైనా చేయాలని (ఇజ్రాయెల్ అంశంలో) గత అధ్యక్షులు చెప్పేవారు. కానీ వారు చేసిందేమీ లేదు. వాళ్లకు ధైర్యం లేకనో, మనసు మార్చుకోవడం వల్లనో నేను చెప్పలేను’ అని ట్రంప్ అన్నారు. తాజా నిర్ణయంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీని ట్రంప్ నెరవేర్చినట్లైంది.
కాగా, ట్రంప్ నిర్ణయంపై పలు అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ చర్యతో మధ్య ప్రాచ్య దేశాల్లో ఉద్యమం రావొచ్చని ఆ దేశాధినేతలు హెచ్చరించారు. ట్రంప్ మాట్లాడుతూ ‘జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం. గత ఏడు దశాబ్దాల్లో ఇజ్రాయెల్ ప్రజలు యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి జీవించే దేశాన్ని నిర్మించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా... ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు కూడా అమెరికా కట్టుబడి ఉంది’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ముస్లింలను రెచ్చగొట్టే చర్య: సౌదీ
సౌదీ రాజు సల్మాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్ సిసీలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను ట్రంప్ చర్య రెచ్చగొడుతుందనీ, ఇదొక అపాయకర చర్య అని సల్మాన్ అన్నారు. ట్రంప్ చర్య ‘తప్పు, చట్ట వ్యతిరేకం, అత్యంత ప్రమాదకరం, రెచ్చగొట్టేది’ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ విమర్శించారు.
ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత..
ట్రంప్ నిర్ణయంపై పలు అరబ్ దేశాల అధినేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న మధ్య ప్రాచ్య దేశాల్లో ట్రంప్ చర్య మరింత ఉద్రిక్తతలను తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంపైనా దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జెరూసలేంపై నిర్ణయం తీసుకునే ముందు మధ్యప్రాచ్యంలోని దేశాధినేతలతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌లతోపాటు జోర్డాన్, సౌదీ, ఈజిప్టు అధినేతలతోనూ చర్చించారు.
జెరూసలెం.. మూడు మతాల పవిత్ర స్థలం
జెరూసలెం మూడు మతాలకూ పవిత్ర స్థలం. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు ఈ నగరాన్ని పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వా రు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలోని హోలీ సిపల్చర్ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్‌తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే క్రీస్తుకు శిలువ వేశారని చెబుతారు. చర్చిలోని క్రీస్తు సమాధిని సందర్శించేందుకు లక్షలాది మంది క్రిస్టియన్లు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తుంటారు.
పాత నగరంలోని అల్ అక్సా మసీదు.. ముస్లింలకు మూడో పవిత్ర స్థలం. మక్కా నుంచి మహ్మద్ ప్రవక్త ఇక్కడకు వచ్చి అందరి ప్రవక్తల తరపున ప్రార్థనలు చేసినట్లు ముస్లింలు భావిస్తారు. జెరూసెలంలోని వెస్ట్రన్ వాల్ యూదులకు పవిత్ర స్థలం. యూదులు ఉండే ప్రాంతంలో ఈ సున్నపురాయి గోడ ఉన్నది. భూగోళం ఇక్కడ నుంచే పుట్టిందని యూదులు భావిస్తారు. అబ్రహం కూడా తన కుమారుడు ఐజాక్‌ను త్యాగం చేయాలని చూసింది ఇక్కడేనట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు దీనిని దర్శించుకుంటారు.
అమెరికా ప్రకటనకు వ్యతిరేకంగా ముస్లింల నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment