రమల్లా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌పై పాలస్తీనా నేతలు ఘాటుగా స్పందించారు. ‘మీరు డాలర్లతో కొనడానికి.. జెరూసలేంను మేము అమ్మకానికి పెట్టలేద’ని పాలస్తీనా అధ్యక్షుడు హుమ్మద్ అబ్బాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బ్లాక్ మెయిలింగ్ చర్యలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాలస్తీనా అథారిటికి ప్రతి ఏడాది ఇచ్చే 300 మిలియన్ డాలర్ల నిధుల్లో కోత పెడతానంటూ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిదే. ట్రంప్ హెచ్చరికలపై స్పందించిన ఆ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనూ జెరూసలేంను వదులుకోమని తెగేసి చెప్పింది. జెరూసలేంపై అమెరికా నిర్ణయంతోనే ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలు దెబ్బతిన్నాయని.. ఇప్పుడు కొత్తగా జరిగే నష్టమేమీ లేదని చెప్పడం గమనార్హం.
జెరూసలేం అనేది.. పాలస్తీనా శాశ్వత రాజధాని. మా రాజధాని ప్రాంతాన్ని డాలర్లు లేదా బంగారంతో ఎవరూ కొనలేరని మహుమ్మద్ అబ్బాస్ అధికార ప్రతినిధి నబిల్ అబు రెహమాన్ ఘాటుగా సమాధానం చెప్పారు. బ్లాక్ మెయిలింగ్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగమని పాలస్తీనా ఉన్నతాధికారణి హనమ్ ఆశ్రవి స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో అశాంతి, అల్లర్లు జరగడానికి ట్రంప్ చర్యలే కారణమని ఆమె ఆరోపించారు.
ఇదిలావుండగా.. పాలస్తీనా అథారిటీకి నిధులు నిలిపేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ప్రభుత్వం స్వాగతించింది. అమెరికా చర్యలను నిరసించేవారు.. ఆ దేశ నిధులను కూడా వద్దనుకోవాలని ఇజ్రాయిల్ మంత్రి మిరి రెగేవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment