జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న రాజధాని సమస్య విషయంలో ట్రంప్ నిర్ణయం మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య సమస్యకు కారణాలు.. అమెరికా వైఖరి గురించిన కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం..
చరిత్ర..
మధ్య ప్రాచ్య దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్. దీనికి సమీపంలోనే పాలస్తీనా ఉంది. అయితే పాలస్తీనాకు స్వతంత్ర రాజ్యంగానే గుర్తింపు ఉంది. కానీ, పూర్తి స్థాయి దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించడం లేదు. ఇజ్రాయెల్‌లో 87 లక్షల వరకు జనాభా ఉంటారు. ఇక్కడ యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు, ఆర్మేనియన్లు ఉన్నారు. ఎక్కువగా యూదుల ఆధిపత్యం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ రాజధానిగా టెల్ అవీవ్ ఉండేది. ఇక పాలస్తీనా, జెరూసలెంను రాజధానిగా భావిస్తోంది. అయితే ఇది ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. పాలస్తీనా జనాభా దాదాపు 45 లక్షలకు పైగానే ఉంటుంది.
అతి ప్రాచీన నగరం..
ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో జెరూసలెం ఒకటి. ఈ నగరాన్ని క్రైస్తవులు, యూదులు, ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వారు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలో ని హోలీ సిపల్చర్ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్‌తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి.
గాజా–వెస్ట్ బ్యాంక్ సమస్య..
పాలస్తీనా–ఇజ్రాయెల్‌ల మధ్య అనేక అంశాల్లో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య 1948, 1967ల్లో యుద్ధాలు కూడా జరిగాయి. 1967నాటి యుద్ధంలో పాలస్తీనా పరిధిలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజాలు ఇజ్రాయెల్ సొంతమయ్యాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్ ఎక్కువగా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీంతో ఇక్కడ జరిగే కార్యకలాపాల్ని, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్ని ఆ దేశం విజయవంతంగా అణచివేస్తోంది. పైగా ఇక్కడ క్రమంగా యూదుల సంఖ్య పెరుగుతోంది. కాగా, గాజా మాత్రం హమాస్ అనే ఇస్లామిక్ సంస్థ ఆధీనంలో ఉంది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను దక్కించుకునేందుకు జ్రాయెల్, పాలస్తీనాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండూ దేనికి దక్కితే, అది పెద్ద దేశమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి కష్టంగానే మారింది.
ఇజ్రాయెల్ దేశంగా మారడం వెనుక..
ప్రపంచంలోనే యూదులు ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. అయితే 20వ శతాబ్దంలోపు యూదు మతం దాదాపు అంతరించి పోయే స్థితికి చేరింది. యూదులు యూరప్ సహా అనేక దేశాల్లో స్వల్ప సంఖ్యలో ఉన్నారు. అయితే వీరంతా, తమకు ఓ ప్రత్యేక దేశం ఉండాలని భావించారు. తమ మతానికి ప్రాధాన్యం ఉన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అలా యూదలందరి మదిలో మెదిలింది ఇజ్రాయెల్. పైగా అది వారి చారిత్రక నగరం. అయితే అప్పుడు అది పాలస్తీనాగా, బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండేది. 1896–1948 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదుల్లో 90 శాతం మంది ఇక్కడికి చేరారు. అప్పటికే అక్కడ అరబ్బులు అధికంగా ఉండేవారు. అంటే ముస్లింలు, క్రిస్టియన్లు పాలస్తీనాలో ఉన్నారు. కానీ యూదుల రాకతో, వీరి మధ్య తీవ్ర సంక్షోభం తలెత్తింది. దీంతో ఐక్యరాజ్య సమితి దీన్ని రెండు రాజ్యాలుగా విడగొట్టాలనుకుంది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, పాలస్తీనియన్లు అంగీకరించలేదు. పాలస్తీనాకు అరబ్బు రాజ్యాలైన ఈజిప్టు, జోర్డాన్, ఇరాక్, సిరియాలు మద్దతు తెలిపి, ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించాయి. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపొందింది. దీంతో పాలస్తీనా ఆధీనంలోని 77 శాతం భూమి ఇజ్రాయెల్ పరమైంది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించాయి. ఇదే సమయంలో జెరూసలెం నగరం కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి మారిపోయింది.
జెరూసలెం వివాదం
ఈ నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటి ఆధీనంలో ఉంది. కాగా ఇప్పటికే టెల్ అవీవ్ పట్టణం ఇజ్రాయెల్ రాజధానిగా ఉండేది. పాలస్తీనా మాత్రం జెరూసలేంను రాజధానిగా భావించింది. అయితే ఈ నగరం రెండు దేశాల మధ్య ఉండడంతో, దీని విషయంలో వివాదం కొనసాగుతోంది. నగరంలోని ఎక్కువ ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండగా, కొంత భాగం జోర్డాన్ పరిధిలో ఉంది. జెరూసలేంను తమ రాజధానిగా ప్రకటించాలని ఇజ్రాయెల్ కొన్నేళ్ల నుంచి కోరుతోంది. దీనికి ఇప్పుడు అమెరికా అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త సమస్యలు..
జెరూసలేం విషయంలో ట్రంప్ నిర్ణయంపై పాలస్తీనా, జెరూసలెంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న మధ్య ప్రాచ్య దేశాల్లో ట్రంప్ చర్య మరింత ఉద్రిక్తతలను తెస్తుందని అరబ్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే తమ నిర్ణయం ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు దోహదం చేస్తుందని, ఈ విషయంలో అమెరికా సాయపడుతుందని ట్రంప్ అన్నారు. అలాగే పాలస్తీనాకు కొంత నష్ట పరిహారం అందించడం, లేదా ఇజ్రాయెల్‌లోని కొంత భాగాన్ని అప్పగించడం వంటివి చేసే అవకాశాలున్నాయని నిపుణుల మాట.
గాజా–వెస్ట్ బ్యాంక్
– సాక్షి, స్కూల్ ఎడిషన్
Comments
Please login to add a commentAdd a comment