న్యూఢిల్లీ : ‘జలుబుకు మందు వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది. మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది’ అనే కామెంట్ వినే ఉంటాం. జలుబు దానంతట అది తగ్గాల్సిందేగానీ దానికి మందు లేదనే అర్థంలోనే ఈ కామెంట్ చేయడం కద్దూ! బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే జబ్బులకు మందులు ఉన్నాయని, జలుబు వైరస్‌ల ద్వారా వస్తుంది కనుక మందులేదని వాదించే వారు ఉన్నారు. వారి వాదనలో నిజమెంత? వాతావరణంలో ఉండే దాదాపు రెండు వందల రకాల వైరస్‌ల్లో ఏదో దాని వల్ల జలుబు, దాంతోపాటు దగ్గు వస్తుంది. ఇది ఒకరికి సంవత్సరానికి మూడుసార్లు పట్టి పీడిస్తుంది. శీతాకాలం, వర్షాకాలంలో జలుబు ఎక్కువగా రావడానికి కారణం ఆ సమయాల్లో వైరస్‌లు క్రియా శీలకంగా ఉంటాయి.
ఎవరైనా ఒక్కసారి ముక్కు చీది నపుడు కొన్ని లక్షల వైరస్ కణాలు బయటకు వస్తాయి. వాటిని శాస్త్ర విజ్ఞానపరంగా ‘వైరియాన్స్’ అంటారు. వీటిలో దేనివల్ల నైనా ఇతరులకు జలుబు రావచ్చు. ఒకరు ముక్కు ద్వారా ఊపరి తిత్తుల్లోకి గాలి పీల్చుకున్నప్పుడు దాదాపు పదివేల వైరస్ కణాలు లోపలికి వెళతాయి. అవి తిరిగి బయటకు వచ్చేటప్పుడు గొంతు, ముక్కులోని ‘ఎపిథెలియల్ సెల్స్’కు కొన్ని వందల వైరస్ కణాలు అతుక్కుపోతాయి. అక్కడ వాటి పరాన్న సైకిల్ మొదలవుతుంది. దాని వల్ల జలుబు, దగ్గు వస్తుంది. చిన్నగా ప్రారంభమయ్యే జలుబు మూడు రోజుల్లోనే ముదురుతుంది. ఒక్క రోజులోనే కొన్ని లక్షల వైరస్ ఎన్‌ఫెక్ట్ అయిన ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి.
విక్స్, ఇతర జలుబు మందుల వల్ల 50 శాతమే జలుబును నివారించవచ్చని, మొదటి రోజు తీసుకునే జాగ్రత్తల వల్లనే దీన్ని త్వరగా నయం చేసుకోవచ్చని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌వర్డ్, కార్డిఫ్ యూనివర్శిటీలోని ‘కామన్ కోల్డ్ సెంటర్ డైరెక్టర్’గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాన్ ఎకిల్స్, లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఎక్స్‌పర్మెంట్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పీటర్ ఓపెన్‌షా తెలియజేశారు.
జలుబు సోకగానే చేతులు, ముక్కు, నోరు ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవాలి. తుమ్ములు వచ్చినప్పుడు శుభ్రంగా ఉతికిన గుడ్డలను మార్చి మార్చి వాడాలి. కళ్లు నలుపుకో కూడదు. అలా చేస్తే కళ్లకు వైరస్ సోకుతుంది. రోజుకు వేడి నీళ్లలో తేనె, నిమ్మ రసం కలుపుకొని మూడు సార్లు తాగాలి. గొంతు మంట నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. చికెన్ సూప్ రెండు సార్లు తీసుకుంటే అది బాగా పని చేస్తుంది. ఐబ్రూఫిన్ లాంటి మందులు కూడా ఉపశమనం ఇస్తాయి. జలుబు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా సోకి, నిమోనియా వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ ముగ్గురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరికి జలుబు ఎక్కువగా రావడానికి, కొందరికి రాకపోవడానికి కారణం వారి రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్యపై ఆధార పడి ఉంటుందని, తెల్ల రక్తకణాలు వైరస్‌లను శక్తివంతంగా ఎదుర్కొంటాయని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment