ఈ నగరాలు ఏం చేస్తున్నాయి?
ఈ నగరాలు ఏం చేస్తున్నాయి?
Published Wed, Nov 16 2016 6:59 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
30 లక్షలు
ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపిన వివరాల ప్రకారం, వాయుకాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 30 లక్షల మంది మరణిస్తున్నారు.
98 %
పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 98 శాతం నగరాల్లో వాయు నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే దిగువ స్థాయిలో ఉంది.
56 %
అభివృద్ధి చెందిన దేశాల్లోని 56 శాతం నగరాల్లో వాయునాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే తక్కువగా ఉంది.
నగరాల్లోని వాయు కాలుష్యం ఇంతకుముందు కూడా సమస్యే గానీ, అదేదో పర్యావరణవేత్తలకు పరిమితమైన చర్చలా కనబడేది. ఇప్పుడు సామాన్యుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు వాయుకాలుష్యం కారణమవుతోంది. మనిషి వెంట్రుక వ్యాసం సుమారు 100 మైక్రోమీటర్లు అనుకుంటే, దానిలో పదోవంతుండే కాలుష్య కణాలు (పీఎం 10) మనిషి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. మరింత చిన్నవి (పీఎం 2.5) నేరుగా రక్తప్రవాహంలో కలిసిపోవచ్చు. కొన్ని మెదడులోకి కూడా వెళ్లే ప్రమాదముందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ప్రపంచంలో చాలా నగరాలు దీనిమీద స్పందిస్తున్నాయి. ఒకవిధంగా యుద్ధమే చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అమలు చేసిన, చేస్తున్న, చేయనున్న విధానాలు:
పారిస్ (ఫ్రాన్స్):
దేశం నడిబొడ్డున ఉన్న జిల్లాల్లో వారాంతాల్లో కార్లను నిషేధించారు. సరి-బేసి వ్యవస్థను అమలుచేశారు. కార్లనూ, బైకుల్నీ పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సీన్ నది కుడి గట్టుమీద అత్యధిక భాగం కార్ ఫ్రీ జోన్ చేశారు. అధిక కాలుష్య రోజుల్లో ప్రజారవాణా వ్యవస్థను ఉచితంగా వినియోగించుకునేలా ఏర్పాటుచేశారు.
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్):
సైకిళ్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అక్కడి జనం కంటే సైకిళ్ల సంఖ్య ఎక్కువ. నగరంలోని చాలా ప్రదేశాల్లో పెద్ద వాహనాలను కొన్ని దశాబ్దాలుగా అనుమతించడం లేదు. 2025 నాటికి కర్బన రహిత నగరంగా దీన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్):
సైకిళ్ల వినియోగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ కార్లను ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు.
ఓస్లో (నార్వే):
2020 నాటికి కాలుష్యాన్ని సగానికి సగం తగ్గించేలా నగరంలోని అత్యధిక ప్రదేశాల్లో 'నో కార్ జోన్' ప్రవేశపెడుతున్నారు. కార్ పార్కింగ్ ప్రదేశాలను తొలగించి, సైకిళ్ల మార్గాలను నిర్మిస్తున్నారు. రష్ అవర్లలో మోటారిస్టుల మీద అధిక పన్ను వసూలు చేయనున్నారు.
లండన్ (బ్రిటన్):
2017 నుంచి అధిక కాలుష్యానికి కారణమయ్యే వాహనాలు నగరం మధ్యలోకి ప్రవేశించాల్సివస్తే 10 పౌండ్ల సర్‌చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. 2019 నుంచి సిటీ సెంటర్లో అతి తక్కువ కాలుష్య ఉద్గారాల జోన్‌ను ప్రవేశపెట్టనున్నారు.
జ్యూరిక్ (స్విట్జర్లాండ్):
పార్కింగ్ స్థలాలను తగ్గించారు. నగరంలోకి కార్ల ప్రవేశాన్ని నిర్ణీత సంఖ్యలో అనుమతిస్తారు. ట్రాముల లేన్లు వేస్తున్నారు. కార్ ఫ్రీ జోన్లు, పాదచారులకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.
కురిటీబా (బ్రెజిల్):
'గ్రీనెస్ట్ సిటీ ఆన్ ఎర్త్'గా పిలిచే ఈ నగరంలో 70 శాతం మంది ప్రజారవాణా వ్యవస్థనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ట్రాఫిక్ జాముల బెడద కూడా తప్పింది. బస్సులకు ప్రత్యేకంగా లేన్లను కేటాయించడం, ఎక్కువమందిని తీసుకెళ్లేలా పెద్ద బస్సులను ప్రవేశపెట్టడం చేస్తున్నారు.
ఫ్రైబెర్గ్ (జర్మనీ):
500 కిలోమీటర్ల సైకిల్, ట్రామ్ రూట్లను నిర్మించారు. ప్రజారవాణా వ్యవస్థను అతి చౌక చేశారు. ఇళ్ల దగ్గర కార్ల పార్కింగ్‌ను నిషేధించారు. పట్టణ శివార్లలో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. దానికిగానూ ఏడాదికి దాదాపు రూ. 13 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
హెల్సింకి (ఫిన్‌లాండ్):
పార్కింగ్ ఫీజులను భారీగా పెంచనున్నారు. ఇన్నర్ సిటీ రింగ్ రోడ్లను వాకింగ్ జోన్లుగా మార్చనున్నారు. 2050 నాటికి ఎవరూ ప్రత్యేకంగా కారును కోరుకోవాల్సిన పనిలేనంతగా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపడుతున్నారు.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Advertisement
Advertisement