
మరోసారి ట్రంప్ కంపు వ్యాఖ్యలు!
రిపబ్లికన్ అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం తమని ద్వేషిస్తుందని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా మరింత క్రూరమైన ఇంటరాగేషన్ పద్ధతులను అమలు చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.
'ఇస్లాం మన్నలి ద్వేషిస్తుందని అనుకుంటున్నా. అందులో విపరీతమైన విద్వేషముంది. దానిలోతుల్ని మనం చూడాల్సిన అవసరముంది. మన పట్ల దానికి నమ్మశక్యంకాని రీతిలో విద్వేషముంది' అని ట్రంప్ సీఎన్ఎన్ చానెల్ ప్రతినిధి అండర్సన్ కూపర్ తో మాట్లాడుతూ అన్నారు. ఇస్లాం మతంతో పశ్చిమ దేశాలు యుద్ధానికి దిగుతున్నాయని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.
పూర్తిగా ఇస్లాంని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక అందులోని అతివాదులను ఉద్దేశించి అన్నారా? అని అడుగగా.. 'దానిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముంది. కానీ అందులో విపరీతమైన విద్వేషముంది. మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అమెరికా పట్ల విద్వేషమున్న వ్యక్తులు మన దేశంలోకి రాకుండా చూడాలి. ముస్లింలు రాకుండా చూడాలి' అని ఆయన పేర్కొన్నారు. మీరు 'రాడికల్ ఇస్లాం' గురించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక ఇస్లాం మతం గురించేనా? అని కూపర్ పట్టుబట్టగా.. 'రాడికల్ గురించే కానీ దీనిని నిర్వచించడం చాలా కష్టం. వీటిని వేర్వేరుగా చూడటం కష్టం. ఎవరు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టం' అని ట్రంప్ పేర్కొన్నారు.