
ఇది స్మార్ట్‌ఫోనో, పిస్టలో తేల్చండి!
వాషింగ్టన్: ఇది అచ్చం నూటికి నూరుపాళ్లు స్మార్ట్‌ఫోన్‌లా ఉంది. ఏ ప్యాకెట్లో పెట్టుకున్నా, ఎక్కడికి తీసుకెళ్లినా ఎవరైనా సరే దీన్ని స్మార్ట్‌ఫోనే అంటారు. కాదన్నా ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా ఇది స్మార్ట్‌ఫోన్ ఎంతమాత్రం కాదు. అలా కనిపించేలా తయారు చేశారు. ఓ డమ్మీ కెమెరా లెన్స్‌ను, ఇయరింగ్ సాకెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇది డబుల్ బారెల్, 380 కాలిబర్ పిస్టల్. దీంతో ఎవరినైనా ఇట్టే షూట్ చేసి చంపొచ్చు. ఇది మూసి ఉన్నప్పుడు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుంది. సేఫ్టీ లాక్ ఓపెన్ చేస్తే పిస్టల్‌లా తయారై ట్రిగ్గర్ బయటకు వస్తుంది.
ఈ అత్యాధునిక పిస్టల్‌ను ‘ఐడియల్ కన్సీల్’ అనే కంపెనీ తయారు చేసింది. స్థానిక ఉత్పత్తులతోనే దీన్ని తయారు చేశామని, పేటెంట్ రాగానే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని కంపెనీ చెబుతోంది. దాదాపు 27వేల రూపాయలకు అమ్ముతామంటూ ధరను కూడా ప్రకటించేసింది. ఇదంతా బాగానే ఉందిగానీ అసలే తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉన్న అమెరికాలో ఇలాంటి పిస్టళ్లు అందుబాటులోకి వస్తే ఎంత ప్రమాదకరం? టెర్రరిస్టుల చేతుల్లో పడితే జరిగే విధ్వంసానికి అంతు ఉంటుందా? స్మార్ట్‌ఫోన్ లాంటి ఈ పిస్టల్‌ను బహిరంగంగా సెక్యూరిటీ చెకప్ గుండానే విమానాల్లోకి తీసుకుపోవచ్చు. అప్పుడు జరిగే విధ్వంసక పరిణామాలను సులభంగానే ఊహించవచ్చు.
ఇలాంటి భయాందోళనలనే వ్యక్తం చేస్తున్నారు ‘కోయలిషన్ టు స్టాప్ గన్ వాయలెన్స్’ సంస్థ డిప్యూటి కమ్యూనికేషన్స్ డెరైక్టర్ ఆండ్రూ ప్యాట్రిక్. ఈ పిస్టల్‌కే గనుక పేటెంట్‌ను కల్పించినట్లయితే గన్ సంస్కృతి తీవ్రంగా పెరిగిపోతోందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిస్టల్ పెట్టుకున్న బ్యాడ్ బాయ్ ఎవరో, స్మార్ట్‌ఫోన్ పెట్టుకున్న గుడ్‌బాయ్ ఎవరో గుర్తుపట్టడం కూడా కష్టమని ఆయన అన్నారు. ఆ పరిస్థితే వస్తే, ఎవరూ జేబులోనుంచి స్మార్ట్‌ఫోన్ తీసినా అది పిస్టల్ అనుకొని భయపడాల్సి వస్తుందని ప్యాట్రిక్ వ్యాఖ్యానించారు.
భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి భయాందోళనలే వ్యక్తం చేస్తున్నారు. వారి భయాందోళనలను తాము అర్థం చేసుకున్నామని, శత్రువుల నుంచి ముప్పున్న వారికి కేవలం ఆత్మరక్షణార్థమే వీటిని విక్రయిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ పిస్టళ్లు వారికి మాత్రమే పరిమితమవుతాయన్న గ్యారెంటీ ఏమీ లేదుకదా! అయినా లెసైన్స్ తుపాకుల పట్ల మోజు చూపించేవారు మాత్రం ఈ పిస్టళ్లు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తాయా! అని ఎదురుచూస్తున్నారు.