సిడ్నీ ఒపెరా హౌస్
ఇది ఇలా కాకుండా అలా ఉండుంటే.. భూమి గుండ్రంగా కాకుండా.. బల్లపరుపుగా ఉండుంటే.. సిడ్నీలోని ప్రఖ్యాత ఒపెరా టవర్ అలా కాకుండా.. వేరొకలాగా ఉండుంటే..! నిజంగానే ఉండేదేమో.. ఎందుకంటే.. ఆ ప్రాంతంలో అది కట్టాలని నిర్ణయించినప్పుడు వచ్చిన డిజైన్లలో ప్రస్తుతమున్న మోడల్ సెలెక్ట్ అయింది కాబట్టి.. ఒపెరా హౌస్ అలాగుంది.. ఎంపిక కమిటీ వేరే ఆర్కిటెక్ట్ ఇచ్చిందాన్ని సెలెక్ట్ చేసుంటే.. అది వేరేలా ఉండేది కదా.. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కొన్ని కట్టడాలకు సంబంధించి.. తిరస్కరించిన డిజైన్లను.. ఎంపికైన డిజైన్లతో బ్రిటన్‌కు చెందిన ‘గో కంపేర్’ వెబ్‌సైట్ పోల్చింది. మనం కూడా ఆ తిరస్కృత డిజైన్లను ఓసారి తిరగేద్దామా..
– సాక్షి, తెలంగాణ డెస్క్
సిడ్నీ ఒపెరా హౌస్..
దీని నిర్మాణం కోసం 1955లో డిజైన్ల పోటీని నిర్వహించారు. 223 ఎంట్రీలు రాగా.. డెన్మార్క్‌కు చెందిన జామ్ అట్జాన్ ఇచ్చిన సెయిలింగ్ బోట్ డిజైన్ ఎంపికైంది. సర్ ఎగీన్ గూసెన్స్ ఇచ్చిన డిజైన్‌ను తిరస్కరించారు.
లింకన్ మెమోరియల్..
1911లో వాషింగ్టన్ డీసీలో దీని నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని డిజైన్ బాధ్యత హెన్రీ బాకన్‌కు అప్పగించారు. అయితే.. జాన్ రసెల్ పోప్ అనే ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కూడా ఉత్సాహం చూపడంతో మెమోరియల్ కమిషన్ ఆయన రూపొందించిన పిరమిడ్ టైపు డిజైన్‌ను కూడా పరిశీలించింది. అయితే.. చివరగా హెన్రీ మోడల్‌కే ఓకే చెప్పింది.
ప్యారిస్‌లోని ఆర్క్ ద త్రియాంప్
ఫ్రాన్స్ తరఫున యుద్ధాల్లో పోరాటం చేసి ప్రాణాలొదిలిన వారికి స్మారకంగా నగరం మధ్యలో దీన్ని నిర్మించారు. 1836లో ప్రారంభమైంది. అయితే.. 1758లోనే సరిగ్గా ఇదే ప్రాంతంలో ఏనుగు మోడల్‌లో ఓ భారీ నిర్మాణం చేపట్టడం కోసం చార్లెస్ రిబార్ట్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ ఇచ్చారు. మూడంతస్తుల్లో ఉండే ఈ ఏనుగులోకి వెళ్లడానికి రింగులు తిరిగే నిచ్చెన వంటివి పెట్టారు. అయితే.. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ డిజైన్‌ను తిరస్కరించింది. ఓకే చేసుంటే.. ఆ ప్లేస్‌లో ఇదుండేది.
లండన్‌లోని టవర్ బ్రిడ్జి
థేమ్స్ నదిపై ఉన్న ఈ వంతెన నిర్మాణం కోసం మొత్తం 50 డిజైన్లు వచ్చాయి. చివరగా.. లండన్ సిటీ అధికారిక ఆర్కిటెక్ట్ సర్ జోన్స్ ఇచ్చిన మోడల్ ఎంపికైంది. ఎఫ్.జె.పామర్ అనే ఆర్కిటెక్ట్.. వంతెనలోని కొన్ని భాగాలు అవసరానికి తగ్గట్లు కదిలేలా ఉన్న డిజైన్ ఇచ్చారు. అయితే.. అది ఎంపిక కాలేదు..
Comments
Please login to add a commentAdd a comment