ఏడ్చినా సంతోషంగా ఉండొచ్చట!
లండన్: ఏదైనా విషయంలో బాధ కలిగి ఏడవాలినిపిస్తే వెంటనే ఏడ్చేయండి. అంతేకానీ బాధను దిగమింగుకుని మనసులో దాచుకుంటే అది మరింత ఎక్కువవుతుంది. అయితే మనసారా కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఆ బాధ నుంచి త్వరగా బయటపడొచ్చని, అనంతరం మనసు ప్రశాంతంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నెదర్లాండ్స్‌కు చెందిన టిల్‌బర్గ్ యూనివర్సిటీ నిపుణులు 60 మందిపై అధ్యయనం జరిపి ఈ విషయాలు వెల్లడించారు. దీనిలో భాగంగా పరిశోధనలో పాల్గొన్న వారికి బాధకలిగించే చిత్రాలను 90 నిమిషాలపాటు ప్రదర్శించారు.
వీరిలో ఆ చిత్రాలను చూస్తూ 28 మంది వెంటనే ఏడ్చేశారు. మరో 32 మంది మాత్రం కన్నీళ్లు పెట్టుకోకుండా లోలోపలే బాధపడ్డారు. చిత్రాలు చూసిన అనంతరం ఏడ్చిన వారి మూడ్ మారిపోగా, ఏడవకుండా ఉన్న వారి మూడ్‌లో ఎలాంటి మార్పూ లేకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సినిమా చూడకముందు ఎలాంటి ఆనందమైన మూడ్‌లో ఉన్నారో ఏడ్చినవారు అదే మూడ్‌కు చేరుకోగా, ఏడ్వని వారు మాత్రం తిరిగి ఆ స్థితికి రావడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఈ పరిశోధనను బట్టి ఏదైనా బాధ కలిగితే వెంటనే ఏడ్వడం ద్వారా తిరిగి మామూలు స్థితికి రావొచ్చని, లేకుంటే దాని ప్రభావం ఎక్కువ సేపు ఉంటుందని పరిశోధకులు తెలిపారు.