ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని వచ్చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. క్రికెటర్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్, పాక్‌లో వంశపారపర్యంగా వస్తున్న రెండు అతిపెద్ద పవర్‌హౌజ్‌లను కొల్లగొట్టారు. అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం చాలా సాధారణంగా జరిగింది. అధ్యక్షుడు, మాజీ ఇండియన్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూతో పాటు కొంతమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
కాగా జూలై 25న దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) 116 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. 272 స్థానాల్లో పోటీ చేసిన పీటీఐ అధికారానికి కేవలం 21 స్థానాల దూరంలో నిలిచిపోయింది. సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం పాకిస్తాన్‌లో ఆనవాయితీ. ఈ మేరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు 176 ఓట్లు రాగా, షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.
రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన.. ఇమ్రాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ 1992లో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఇమ్రాన్‌ఖాన్ లాహోర్‌లో 1952లో ఉన్నత మధ్యతరగతి పష్టున్ కుటుంబంలో జన్మించారు. అచిసన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ అనంతరం ఇంగ్లాండ్‌లోని వోర్స్‌స్టర్‌లో రాయల్ గ్రామర్ స్కూల్ వోర్స్‌స్టర్‌లో, ఆక్స్‌ఫర్డ్‌లోని కేబుల్ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. 13 ఏళ్ల వయసులోనే ఇమ్రాన్ క్రికెట్ ఆడటం ప్రారంభించారు. తొలుత కాలేజీ తరుఫున, అనంతరం 18 ఏళ్ల వయసులో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ టీమ్‌లో పాలుపంచుకున్నారు. 1982 నుంచి 1992 వరకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment