
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు ఈనెల 6న ఇరు దేశాల సీనియర్ కమాండర్ స్ధాయి సైనిక సంప్రదింపులు జరగనున్నాయి. భారత్-చైనాల సీనియర్ సైనికాధికారుల సమావేశం ఈనెల 6న జరుగుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్రువీకరించారు. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని గణనీయంగా మోహరించిందని భారత్ అప్రమత్తమై తగు చర్యలు చేపట్టింని ఆయన చెప్పారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలను నిరోధించేందుకు ఇరు దేశాలకు చెందిన సీనియర్ సైనికాధికారుల సంప్రదింపులు జరుపుతారని చెప్పారు.
కాగా మే 5న తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ తీరంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో నెలరోజులుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తత నెలకొంది. లడఖ్ ఘర్షణల అనంతరం మే 9న ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలోని సిక్కిం సెక్టార్ నకులా పాస్ వద్ద ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభవన మొదలైన తర్వాత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు పక్షాలకు చెందిన బెటాలియన్, బ్రిగేడ్ స్ధాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment