ఆ హత్యను తీవ్రంగా ఖండించిన భారత్
న్యూఢిల్లీ: టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్ హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కర్లోవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని.. ఇలాంటి హింసాయుత, ఉగ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎమ్‌ఈఏ ప్రకటనలో పేర్కొంది.
టర్కీలోని అంకారాలో ఓ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్‌పై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు సోమవారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆండ్రీ అక్కడిక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తి ‘అలెప్పో’, ‘రివేంజ్(ప్రతీకారం)’ అని అరిచిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ ఘటనపై రష్యా తీవ్రస్థాయిలో మండిపడుతోంది.