
శ్రీలంకకు భారత్ చేయూత
కొలంబో/న్యూఢిల్లీ: వరదలతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకోవడానికి భారత్ మూడు నౌకల్లో సహాయక సామగ్రిని, సహాయక బృందాలను పంపించింది. ఆహారం, మందులు, నీరు తదితర అత్యవసర సామగ్రిని భారత్ అందజేసింది. ఆ దేశానికి అవసరమైన అన్ని రకాల సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వరదల ధాటికి శ్రీలంకలో ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందగా, మరో వంద మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీంతో కలాని నది వెంట ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరదలతో 14 జిల్లాల్లోని 52 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దాదాపు 3000 కుటుంబాలను 69 అత్యవసర శిబిరాలకు తరలించారు. 1000 ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద రక్షణ చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఆదేశ వైమానిక అధికారి ఒకరు మరణించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్యసమితిని, ఇతర పొరుగు దేశాలను అభ్యర్థించింది. వెంటనే స్పందించిన భారత్ సహాయక సామగ్రి, సహాయక బృందాలను ఆ దేశానికి పంపింది. ఇప్పటికే ఐఎన్‌ఎస్ క్రంచ్ నౌక కొలంబో పోర్టుకు చేరుకోగా, మరో రెండు నౌకలు కూడా శ్రీలంకకు చేరుకోనున్నాయి. కాగా, 2003 తర్వాత శ్రీలంకలో ఇంతటి స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి. అప్పట్లో దాదాపు 250 మంది చనిపోగా, 10,000 ఇళ్లు కూలిపోయాయి.