
న్యూఢిల్లీ : కాంగోలోని భారత్ ఆర్మీ క్యాంపుపై శుక్రవారం జరిగిన రెబల్స్ దాడిని బలగాలు తిప్పికొట్టాయి. యుద్ధభూమి కాంగోలో భారత ఆర్మీ యూఎన్ మిషన్‌పై పని చేస్తోంది. కాంగో స్థానిక 'మై మై' రెబల్స్ ఈ దాడికి పాల్పడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉత్తర కివూ పట్టణానికి 300 కీమీ దూరంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి నుంచి కివూ పట్టణానికి ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మై మై రెబెల్స్ దాడులకు పాల్పడుతున్నారు. శుక్రవారం జరిగిన దాడిలో భారత ఆర్మీ దళాలు ఇద్దరు రెబెల్స్‌ను హతమార్చినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు భారతీయ జవాన్లకు ఈ దాడిలో చిన్నపాటి గాయాలైనట్లు వెల్లడించారు.
కాంగో పౌరులను రక్షించేందుకు ఏర్పాటు చేసిన యూఎన్ బలగాలపై దాడి జరగడం అరుదని కూడా చెప్పారు. చైల్డ్ సోలర్జ్స్‌గా మారుతున్న 22 మంది పిల్లలను కాంగోలోని ఆర్మ్‌డ్ గ్రూప్స్ నుంచి గత నెలలో భారత బలగాలు రక్షించాయి.