
మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇమాజిన్ కప్ ఆసియా రీజినల్ ఫైనల్ పోటీలో భారత్ బృందం విజయం సాధించింది.
మెల్‌బోర్న్: మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇమాజిన్ కప్ ఆసియా రీజినల్ ఫైనల్ పోటీలో భారత్ బృందం విజయం సాధించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టు కోసం నిర్వహించిన ఈ పోటీలో భారత్‌కు చెందిన ఆకాష్ భదానా, వాసు కౌశిక్, భరత్ సుందల్‌ల జట్టు గెలుపొందింది. ఆస్తమా, శ్వాసకోశ రోగులను కాలుష్యం నుంచి కాపాడటం కోసం ‘కైలీ’ పేరుతో వారు రూపొందించిన స్మార్ట్ ఆటోమేటెడ్ యాంటీ పొల్యూషన్, డ్రగ్ డెలివరీ మాస్క్ పరికరానికి పోటీలో మొదటి స్థానం లభించింది.
ఈ గెలుపుతో వారికి దాదాపు 14 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ అందటమే కాక మే నెలలో జరిగే మైక్రోసాఫ్ట్ 2019 ఇమాజిన్ కప్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. జేబులో ఇమిడి పోయే ఈ పరికరం గాలి నాణ్యతను పర్యవేక్షించటమే కాక, తక్కువ గాలి కాలుష్యం ఉన్న మార్గాలను సైతం సూచిస్తుందని బృంద సభ్యుడు సుందల్ తెలిపారు. దీని రూపకల్పనకు ఏడాది పాటు పనిచేశామన్నారు. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో దీన్ని తయారుచేశామని వివరించారు.