ఈ ఏడాది ఉగ్రవాదుల టార్గెట్ అమెరికాపైనే..
వాషింగ్టన్: ఇప్పటి వరకు సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, భారత్వంటి తదితర దేశాలను తమ దాడులతో వణికించిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడిక తన దృష్టిని అమెరికాపై మరల్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తంలో ఐసిస్ అమెరికాలోని పలు చోట్ల దాడులు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆ దేశ పాలక వర్గాలను హెచ్చరించాయి.
అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ ఇతర అధికారులు ఈ అంశంపై తాజాగా వివరాలు తెలియజేస్తూ ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక కొత్త ఉగ్రవాద సమస్య అని అభివర్ణించారు. అది స్వయంగానైనా, వేరొకరిని ప్రోత్సహించడం ద్వారానైనా దాడులు నిర్వహించగలదని చెప్పారు. అది దాడులకు పాల్పడే ప్రాంతం పరిమితమైగానీ, విస్తృతమైగానీ ఉంటుందని చెప్పారు. ఏదేమైనా ఇసారి ఆ ఉగ్రభూతం అమెరికాపై కన్నేసిందని, ఈ సమయంలో తాము అప్రమత్తంగా ఉండకపోతే భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని పరోక్షంగా వారే దాడులు చేయడం ద్వారానైనా, వారి ద్వారా ప్రేరేపితులైన వారి ద్వారానైనా చవి చూడాల్సి వస్తుందని చెప్పారు.