జెరూసలేం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్(71) జైలు నుంచి విడుదలయ్యారు. ఇక్కడి పెరోల్ బోర్డు ఆయన శిక్ష పూర్తికాకుండానే ఆదివారం విడుదల చేసింది. జెరూసలేం మేయర్‌గా, దేశ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ప్రోత్సహించడానికి ఎహుద్ లంచం తీసుకున్నారని కేసు నమోదైంది.
2014లో న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2006లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైన ఎహుద్ పాలస్తీనాతో శాంతిస్థాపనకు విశేషంగా కృషిచేశారు. ఓ దశలో జెరూసలేంలోని కొంత భాగాన్ని శాంతి ఒప్పందం ద్వారా వదులుకునేందుకు సైతం సిద్ధపడ్డారు. మరోవైపు జైలు నుంచి ముందస్తుగా విడుదల అయిన ఎహుద్ కొన్ని మాసాల పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుందని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి అస్సఫ్ లిబ్రటి తెలిపారు.