
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా హైదరాబాద్ వచ్చిన తనకు ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ రాశారు. తన హైదరాబాద్ పర్యటన ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన అనుభవమని పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం అందజేసిన కానుక విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రాష్ట్ర ప్రజలు చూపిన ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ భారత్‌కు తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.