
టోక్యో: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జపాన్‌లో ఆదివారం జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షింజో అబే ఘన విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. లాన్ తుపాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షింజో అబేకే జపాన్ ప్రజలు మళ్లీ పట్టంగట్టనున్నారని ఎన్నికలకు ముందు కూడా పలు సర్వేలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జపాన్‌కు అత్యంత ఎక్కువకాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే నిలవనున్నారు.
జపాన్ పార్లమెంటులో మొత్తం 465 స్థానాలుండగా, 311 సీట్లను షింజో అబేకు చెందిన లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నేతృత్వంలోని కూటమి గెలుచుకోనుందని టీబీఎస్ అనే ఓ వార్తా చానల్ వెల్లడించింది. అబేకు మూడింట రెండొంతుల ఆధిక్యం (310 సీట్లు) లభిస్తే జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణానికి సవరణలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. 9వ అధికరణం ప్రకారం జపాన్ ఏ యుద్ధంలోనూ పాల్గొనకూడదు. యుద్ధమే లేనప్పుడు సైన్యం అవసరం లేదు.
కాబట్టి జపాన్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సైన్యం లేదు కానీ అతికొద్ది మందితో ఆత్మ రక్షణ దళాన్ని మాత్రం ఆ దేశం ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఉత్తర కొరియా కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో 9వ అధికరణానికి సవరణలు చేయడం ద్వారా జపాన్‌కు సొంతంగా మిలిటరీని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాగా, సాధారణం కన్నా ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చి షింజో అబే అందరినీ ఆశ్చర్యపరిచారు.
దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం, ఉత్తర కొరియా అణుపరీక్షలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతోపాటు ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇచ్చేందుకు మళ్లీ తనకే ఓటు వేయాలని షింజో అబే ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేస్తున్న కాన్‌స్టిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ (సీడీపీ), పార్టీ ఆఫ్ హోప్‌లు సరైన పోటీని కూడా ఇవ్వలేకపోయాయి. ఈ రెండు పార్టీలనూ కొన్ని వారాల క్రితమే స్థాపించారు. పార్టీ ఆఫ్ హోప్‌కు 50 సీట్లు, సీడీపీకి 58 సీట్లు దక్కనున్నాయని టీబీఎస్ అంచనా వేసింది.
అబేదే విజయమని సర్వేలు చెబుతున్నప్పటికీ జపాన్‌లో ఆయనను విమర్శించేవారూ ఎక్కువగానే ఉన్నారు. అబే ప్రభుత్వంలో బయటపడిన కుంభకోణాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన ముందస్తు ఎన్నికలు నిర్వహించారని పలువురు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ప్రధాని షింజో అబే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన దాని ప్రకారమే ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరిస్తానన్నారు. రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో చర్చిస్తామని, ఎక్కువ మంది మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తానని అబే పేర్కొన్నారు.
గంటకు 216 కి.మీ. వేగంతో గాలులు
లాన్ తుపాను జపాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షాలతోపాటు గంటకు 216 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులకు ఈ చిన్న ద్వీపదేశం అతలాకుతలమవుతోంది. అనేక ద్వీపాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయానికి రాజధాని టోక్యోపై తుపాను తన ప్రతాపం చూపొచ్చు. పశ్చిమ జపాన్‌లో రైళ్లు, రవాణా సాధనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 420 విమానాల రాకపోకలు నిలిపేశారు. తుపాను కారణంగా ఇద్దరు మరణించారు.