మేకప్ స్కాం: జపాన్ మహిళా మంత్రి రాజీనామా
రాజకీయ విరాళాలను తన మేకప్ కోసం వాడుకున్నారన్న ఆరోపణలతో.. జపాన్ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రధాని ఆమోదించారు. ఈ వ్యవహారం మొత్తం ప్రధాని షింజో అబెకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. యుకో ఒబుచి అనే ఈ మంత్రి వాస్తవానికి జపాన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి కూడా అవుతారని ఒక దశలో అంతా భావించారు. అయితే.. ఉన్నట్టుండి ఈ వ్యవహారం బయటపడటం, అది కాస్తా గందరగోళంగా మారడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి షింజో అబె ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించారు.
ఈ మొత్తం విషయంపై తాను త్వరలోనే విలేకరుల సమావేశం నిర్వహించి అన్ని విషయాలూ బయట పెడతానని ఒబుచి చెబుతున్నారు. 2012 డిసెంబర్ నెలలో షింజో అబె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేసిన తొలిమంత్రి ఒబుచియే. జపాన్లోనే అత్యంత కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల లాంటి శాఖలను సమర్థంగా చేపట్టిన మొట్టమొదటి మహిళా మంత్రిగా ఒబుచి బాగా పేరు గడించారు. దాదాపు 58 లక్షల రూపాయల మొత్తాన్ని సౌందర్య సాధనాలు, ఇతర సామగ్రి కోసం ఓ డిపార్ట్మెంట్ స్టోర్లో ఖర్చుపెట్టినట్లు తేలింది.