
ఉగ్రవాదంపై పొట్టి దేశం గట్టి ఆలోచన
టోక్యో: చిన్నదేశమే అయినా, అగ్రరాజ్యాలతో సమానంగా గొప్ప సాంకేతిక పరిజ్క్షానంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన జపాన్ మరో బృహత్తర కార్యక్రమానికి దిగింది. ఉగ్రవాదుల నుంచి తమ దేశ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమాచార కేంద్రాన్ని వారం రోజుల్లో ప్రారంభించనుంది. ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ ఆలోచనను వేగవంతం చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 16, 2016న ప్రారంభించాలని జపాన్ నిర్ణయించుకుంది. కానీ, ఇటీవల ప్యారిస్ ఘటనతోపాటు అంతకుముందు ముందే ప్రకటించి మరీ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ దేశ పౌరులను హత్య చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జపాన్ ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. టోక్యోలో దీని ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరో ఇరవై దేశాల్లో కూడా తమ ప్రతినిధులను ఈ సంస్థకు అనుసంధానించి పనిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర, పశ్చిమ ఆఫ్రికాలోని దేశాల్లో జపాన్ తన దృష్టిని నిలిపింది. ఈ సంస్థ జపాన్ విదేశాంగమంత్రిత్వ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ వివిధ దేశాల్లో ఉన్న తమ దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల అలికిడి, దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల సమాచారం అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమాచార కేంద్రం అందిస్తుంది. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా తన వంతు సహాయాన్ని జపాన్ ఈ సంస్థ ద్వారా అందించనుంది.