
టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే ప్రయాణించే అధికారిక జంబో జెట్ విమానాల్లో ఒక విమానం రెక్కకు ఉండే ఓ పలక(ల్యాప్ టాప్ సైజ్‌లోది) ఊడిపోయింది. ఈ విషయాన్ని జపాన్ రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత భయాందోళనలు అలుముకున్నట్లు తెలిపారు. హోక్కాయిడోకు ఉత్తరంగా ఉన్న ద్వీపానికి బోయింగ్ 747 జంబో జెట్ బయలుదేరిన తర్వాత దాని రెక్క పలక ఊడిపోయిందని గుర్తించినట్లు అధికారులు చెప్పారు.
అది కనీసం 15 అంగుళాల వరకు ఉంటుందని, విమానం రైట్ వింగ్‌కు ఉండే ఇంజిన్ పక్కన ఉండే పైలాన్‌కు కనెక్ట్ చేసి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో ప్రధాని అబే విమానంలో లేరని, దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అన్నారు. మరోపక్క, ఆ ప్యానెల్ ఎలా ఊడిపోయిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. కాగా, తూర్పు యూరప్ దేశాలకు అబే నేడు (శుక్రవారం) బయలుదేరుతున్నారు. ఆరు రోజులపాటు జరిగే ఈ పర్యటన ఈ జంబో జెట్ విమానాల ద్వారానే జరగనుంది.