టోక్యోలో ఇంపీరియల్ ప్యాలెస్ వద్ద జపాన్ రాణి అయెకో
టోక్యో : సామాన్య ఉద్యోగిని పెళ్లాడేందుకు సిద్ధపడ్డ జపాన్ రాణి అయెకో రాజ కుటుంబాన్ని, రాచరిక హోదాను వీడనున్నారు. దివంగత రాజు తకమొడో మూడవ కుమార్తె అయెకో కియో మోరియా అనే 32 ఏళ్ల షిప్పింగ్ కంపెనీ ఉద్యోగిని వివాహం చేసుకుంటారని జపాన్ రాజప్రాసాద ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. ఏడాది కిందట వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆగస్ట్ 12న వీరి నిశ్చితార్థం జరగనుండగా, అక్టోబర్ 29న టోక్యోలోని మిజి జింగు మసీదులో వివాహ బంధంతో వీరు ఒక్కటవనున్నారు. సోషల్ వెల్ఫేర్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ప్రిన్స్ అయెకోకు గత ఏడాది డిసెంబర్‌లో మొరియాను ఆమె తల్లి రాణి తకమొడో పరిచయం చేశారని ఏజెన్సీ తెలిపింది.
స్ధానిక ఎన్‌జీఓ ద్వారా రాణి తకమొడోకు కియో మోరియా తల్లితండ్రులు ఎప్పటినుంచో పరిచయం. మరోవైపు రాణి అయెకో, కియో మోరియాలకు స్వచ్ఛంద సేవా కార్యకలాపాలతో పాటు పలు ఉమ్మడి అభిరుచులు ఇద్దరినీ దగ్గర చేశాయని చెబుతున్నారు. వీరికి ప్రయాణాలు చేయడంతో పాటు పుస్తక పఠనం వంటి అభిరుచులున్నాయి. జపాన్ చట్టాల ప్రకారం రాణి అయెకో కియో మోరియాను వివాహం చేసుకుంటే రాజ కుటుంబాన్ని విడిచివెళ్లాల్సి ఉంటుంది. అయితే బోనస్ చెల్లింపుల కింద ఆమెకు లక్షలాది డాలర్ల సొమ్ము అందనుంది.
సామాన్యుడిని పెళ్లాడి రాచ కుటుంబాన్ని వీడనుండటం అయెకోనే కాదు, గత ఏడాది మేలో ఆమె సోదరి, మహారాజు పెద్ద మనవరాలు రాణి మాకో కూడా పారామెడికల్ ఉద్యోగి కెల్ కొమొరాను పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి వివాహం తరువాత వాయిదా పడింది. జపాన్ రాణులు మాకో, అయెకో ఇద్దరూ సామాన్యులను పెళ్లాడితే రాజ కుటుంబ సభ్యుల సంఖ్య 17కు పడిపోయి మిగిలిన సభ్యులపై రాచరిక బాధ్యతల భారం పడనుంది.
మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పురాతన రాజకుటుంబంలో వారసత్వ అంశాలపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. సామాన్యుడిని పెళ్లాడిన రాణులు కుటుంబ శాఖలను ఏర్పరచేందుకు అనుమతించండం, రాజకుటుంబ బాధ్యతలను నూతన సభ్యులకు అప్పగించడం వంటి ప్రతిపాదనలను వారసత్వ ప్రక్రియలో భాగంగా పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment