
బొమికెలను మెడలో వేసుకుందాం..
చికెన్ తింటాం.. మరి మిగిలిపోయిన బొమికెలను ఏం చేస్తారు.. ఏం చేస్తాం.. పడేస్తాం అని అంటారా.. వాటిని మెడలో వేసుకోండి అని మేమంటే.. కచ్చితంగా వెరైటీ లుక్ ఇస్తారు కదూ.. ఇదేం ఆదిమ జాతి అలవాటు అంటూ ముఖం చిట్లిస్తారు కదూ.. ఇది ఆదిమ జాతి అలవాటు కాదు.. ఆధునిక ఫ్యాషన్ అట!! చిత్రంలో కనిపిస్తున్నది అదే. ప్రపంచ ప్రఖ్యాత కేఎఫ్‌సీ(కెంటకీ ఫ్రైడ్ చికెన్) గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. వీరిలో కొందరికి.. తమకు ఎంతగానో నచ్చే కేఎఫ్‌సీ చికెన్‌కు మరింత ప్రఖ్యాతి తేవాలని.. అది చిరస్థాయిలో నిలిచిపోయేలా చేయాలని అనిపించింది. దాంతో ఈ చిత్రమైన ఆలోచన వారి బుర్రకు తట్టింది.
కేఎఫ్‌సీ చికెన్ తినగా మిగిలిపోయే బొమికెలను ఆభరణాలుగా మార్చేయాలని ఆ అభిమాన గణంలో భాగమైన ‘కెంటకీ ఫర్ కెంటకీ’ అనే సంస్థ యోచించింది. ఈ పనిని కేఎఫ్‌సీ అభిమాని, ఆభరణాల డిజైనర్ మెగ్‌సీకి అప్పజెప్పింది. మెగ్‌సీ ఏం చేసింది? ఓ రోజు రాత్రి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిన్న కేఎఫ్‌సీ చికెన్‌లో మిగిలిపోయిన బొమికెలను జాగ్రత్తగా దాచి పెట్టింది. అవి మొత్తం 20. వాటిని జాగ్రత్తగా కడిగేసి.. కాపర్ పెయింటింగ్ వేసి.. కొన్ని ప్రక్రియల అనంతరం 14 క్యారెట్ల బంగారు నెక్లెస్‌గా మార్చేసింది. ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్ పేరిట ఆ 20 కేఎఫ్‌సీ బోన్ గోల్డ్ నెక్లెస్‌లను అమ్మకానికి పెట్టారు. వీటిల్లో చిన్న సైజు బొమికెతో చేసిన నెక్లెస్ ధర రూ.7,550 కాగా.. కొంచెం పెద్ద బొమికతో చేసినది రూ.9,550. గత నెల 27 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి.