ప్రధానమంత్రి కుమార్తెకు సమన్లు
ప్రధానమంత్రి కుమార్తెకు సమన్లు
Published Tue, Jun 27 2017 3:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
ఇస్లామాబాద్: పనామా పత్రాలపై విచారణకు గాను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె సమన్లు అందుకున్నారు. మనీలాండరింగ్ కేసులో జూలై 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా కోరుతూ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ) నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌కు సమన్లు జారీ చేసింది. కుమార్తె చదువుకుంటున్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గాను మరియం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. జూన్ 15వ తేదీన ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా జేఐటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇలాంటి విచారణకు హాజరైన మొదటి ప్రధాని ఆయనే. ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ కూడా జూలై 3, 4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పెద్ద కుమారుడైన హసన్‌ను ఇప్పటికే ఐదు సార్లు జేఐటీ విచారించింది. వీరితోపాటు నవాజ్ షరీఫ్ బంధువు తారిఖ్ షఫీను కూడా రెండోసారి జూలై 2 వ తేదీన విచారణకు రావాల్సిందిగా జేఐటీ సమన్లు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జేఐటీ జూలై 10వ తేదీన సుప్రీంకోర్టుకు విచారణ నివేదిక సమర్పించాల్సి ఉంది.
మనీలాండరింగ్ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ నగరం పార్క్‌లేన్ ఏరియాలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్ 20 వ తేదీన ఈ కేసును విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రితో పాటు ఆయన కుమారులను.. ఇంకా సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించే అధికారం కల్పిస్తూ జేఐటీని ఏర్పాటు చేసింది.
Advertisement
Advertisement