గాజుతెర అడ్డుగా.. కలిశారు! | Kulbhushan Jadhav’s meeting with family obscured by glass screen, Pakistan PR | Sakshi
Sakshi News home page

గాజుతెర అడ్డుగా.. కలిశారు!

Published Tue, Dec 26 2017 1:46 AM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

Kulbhushan Jadhav’s meeting with family obscured by glass screen, Pakistan PR - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్‌ జాధవ్‌ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్‌.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటుచేసిన పాక్‌ అధికారులు .. ఇరువైపులా ఫోన్‌ ద్వారా (ఇంటర్‌కామ్‌) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా   రికార్డు చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు జాధవ్‌ కృతజ్ఞతలు తెలిపారని పాక్‌ విదేశాంగ అధికారులు వెల్లడించారు.  

కెమెరా నిఘాలోనే
జాధవ్‌ తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ దుబాయ్‌ నుంచి ఇస్లామాబాద్‌కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. భారత హైకమిషన్‌ కార్యాలయంలో అరగంట గడిపాక ఒంటిగంటకు ఇస్లామాబాద్‌లోని పాక్‌ విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. వీరితోపాటు భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపీ సింగ్, ఓ పాకిస్తాన్‌ అధికారిణి ఉన్నారు. లోపలకు వెళ్లగానే భద్రతా తనిఖీలు నిర్వహించారు.  తర్వాత 1.35గంటలకు ఒక గదిలో వీరు కలుసుకున్నారు. మధ్యలో గాజు తెరనుంచి, ఇరువైపుల నుంచీ ఇంటర్‌కామ్‌ ద్వారా మాట్లాడుకునే ఏర్పాట్లు చేశారు. ఈ తతంగాన్ని కెమెరాలతో చిత్రీకరించారు. తర్వాత భారత ఎంబసీకి వచ్చిన వీరిద్దరూ ఇక్కడ కాసేపు ఉన్న తర్వాత భారత్‌కు పయనమయ్యారు. జాధవ్‌ను కలిసి బయటకొచ్చిన తర్వాత మీడియా ప్రశ్నలు సంధించినా వీరిద్దరూ మౌనంగానే వెళ్లిపోయారు. కార్యాలయం లోపలకు వెళ్లినప్పటినుంచి బయటకు వచ్చేంతవరకు తీసిన దృశ్యాలను, చిత్రాలను పాక్‌ విదేశాంగ శాఖ విడుదల చేసింది. తమ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నా జయంతి ఉత్సవాల సందర్భంగా జాధవ్‌ తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు పాక్‌ పేర్కొంది. ‘ఇస్లామిక్‌ సంప్రదాయాలు, మానవతాదృక్పథంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశాం’ అని పాక్‌ విదేశాంగ ప్రతినిధి ఫైజల్‌ పేర్కొన్నారు.  

దౌత్య సాయమా? కాదా?
సోమవారం సాయంత్రం పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఈ భేటీ వివరాలను వెల్లడించింది. జాధవ్‌తో భార్య, తల్లి కలుసుకోవటాన్ని మానవతా దృక్పథంతోనే ఏర్పాటుచేశామని.. అయితే ఇది కొంతకాలంగా భారత్‌ కోరుతూ వస్తున్న దౌత్యసాయం మాత్రం కాదని తెలిపింది. పాక్‌ విదేశాంగ కార్యాలయంలోకి భారత దౌత్యవేత్త జేపీ సింగ్‌ వచ్చినప్పటికీ ఆయన దూరం నుంచే జాధవ్‌ను చూసేందుకు అవకాశం కల్పించామని.. మాట్లాడనీయలేదని వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖకు ముందే చెప్పామని పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి ఫైజల్‌ పేర్కొన్నారు. దౌత్యసాయంపై నిర్ణయాన్ని పాకిస్తాన్‌ చట్టం, దేశ ప్రయోజనాల ఆధారంగానే తీసుకుంటామన్నారు. ‘30 నిమిషాలసేపు మాట్లాడుకునేందుకు అవకాశం ఇస్తామని ముందే చెప్పాం. కానీ జాధవ్, ఆయన తల్లి కోరిక మేరకు మరో 10 నిమిషాల అవకాశం ఇచ్చాం. జాధవ్, కుటుంబసభ్యులు నేరుగా కలుసుకునేందుకు అవకాశం ఇవ్వమని ముందుగానే సమాచారమిచ్చాం. కుటుంబసభ్యులకు, భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు’ అని ఫైజల్‌ చెప్పారు. అయితే, ఆదివారం రాత్రి పాక్‌ విదేశాంగ మంత్రి ఖవాజా ముహ్మద్‌ ఆసిఫ్‌ మాత్రం.. భారత దౌత్యవేత్తను సమావేశంలోకి అనుమతిస్తున్నందున దీన్ని దౌత్యసాయంగానే పరిగణిస్తామన్నారు.   

పాక్‌ ఆడుతున్న నాటకం: దల్బీర్‌
పాక్‌ తీరుపై భారత్‌లో విమర్శలు వ్యక్తమయ్యాయి. తల్లికి జాధవ్‌ను హత్తుకునే అవకాశం కల్పించి ఉండాల్సిందని జాధవ్‌ మిత్రుడొకరు అభిప్రాయపడ్డారు. అటు, నాలుగేళ్ల క్రితం పాక్‌ జైల్లో హత్యకు గురైన భారతీయుడు సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌.. జాధవ్‌–కుటుంబ సభ్యుల భేటీని పాక్‌ ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. ‘ కుటుంబీకులు అతన్ని హత్తుకునేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఇదంతా పాక్‌ ఆడుతున్న నాటకం. అంతర్జాతీయ సమాజాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు’ అని దల్బీర్‌ మండిపడ్డారు.  

జాధవ్‌కు చిత్రహింసలు!  
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్‌ జాధవ్‌ను పాక్‌ జైలు అధికారులు చిత్రహింసలకు గురిచేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. సోమవారం, భార్య, తల్లితో భేటీ సందర్భంగా పాక్‌ విదేశాంగ శాఖ వెల్లడించిన చిత్రాలు ఈ అనుమానాలను ఊతమిస్తున్నాయి. చిత్రాల్లో జాధవ్‌ చెవి కింద, మెడ భాగంలో, తలపైన గాయాలున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మానవతా దృక్పథమని పాక్‌ చెబుతున్నా అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితిలో ఏళ్ల పాటు భారత దౌత్యవేత్తగా పనిచేసిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. భారత గూఢచారినని జాధవ్‌ను ఒప్పించేందుకే చిత్రహింసలు పెడుతున్నారన్నారు. కాగా, భార్య,తల్లితో భేటీ అనంతరం.. మరోసారి తను భారత గూఢచారినే అంటూ జాధవ్‌ ఒప్పుకున్న వీడియోను పాక్‌ విడుదల చేసింది.  

ఇదే చివరి భేటీ కాదు
ఇన్నాళ్లుగా జాధవ్‌తో కుటుంబ సభ్యులతో భేటీని తిరస్కరిస్తూ వచ్చిన పాక్‌ చివర్లో చల్లని మాటొకటి చెప్పింది. ‘కుటుంబ సభ్యులతో జాధవ్‌ భేటీ ఇదేం చివరిది కాదు. విడతల వారీగా కలిసే అంశాలను పరిశీలిస్తాం’ అని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఫైజల్‌ స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి ముందుగానే భేటీలో మాట్లాడుకున్న వీడియోను ప్లే చేశారు. చివర్లో ‘నా భార్య, తల్లితో కలిసే అవకాశం ఇవ్వమని అడిగాను. అంగీకరించి అనుమతించిన పాక్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని జాధవ్‌ తెలిపారు. అయితే ఉదయమే జాధవ్‌ విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చినా ఆయన్ను తరలించేముందు ఎక్కడుంచారనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు.

అసలు జాధవ్‌ కేసేంటి?
2016 మార్చి 3న జాధవ్‌ను ఇరాన్‌ సరిహద్దు ప్రాంతంలో అరెస్ట్‌ చేసినట్లు పాకిస్తాన్‌ అధికారులు ప్రకటించారు. పాక్‌ వ్యతిరేక విద్రోహచర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఆ తర్వాత భారత గూఢచారిగా ముద్రవేస్తూ ఆ దేశ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్షను విధించింది. అయితే భారత్‌ మాత్రం ఇరాన్‌ నుంచి జాధవ్‌ను కిడ్నాప్‌ చేశారని గట్టిగా వాదిస్తోంది. భారత నావికాదళం నుంచి రిటైరయ్యాక ఇరాన్‌లో తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జాధవ్‌తో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టంచేసింది. భారత్‌ చేసిన విజ్ఞప్తితో మే 18న  అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) జాధవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు, కనీసం ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు గతంలో భారత్‌ చేసిన ప్రయత్నాలన్నీ విఫలయ్యాయి.  

ఎవరీ జాధవ్‌ ?
మహారాష్ట్రలోని సాంగ్లీలో కుల్‌భూషణ్‌ జాధవ్‌ జన్మించారు. తండ్రి సుధీర్‌ జాధవ్‌ ముంబై పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా రిటైరయ్యారు. జాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జాధవ్‌ సొంత వ్యాపారాన్ని ప్రారంభించే ఉద్దేశంతో ముందుగానే నావికాదళం సర్వీసు నుంచి రిటైరైనట్లు ఆయన కుటుంబవర్గాల సమాచారం. వంచన ద్వారానే జాధవ్‌ను పాకిస్తాన్‌లో అరెస్ట్‌ చేశారని భారత్‌ వాదిస్తోంది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

                           జాధవ్‌ను కలిసి బయటికొస్తున్న ఆయన తల్లి, భార్య, దౌత్యవేత్త జేపీ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement