లాడెన్ కొడుకు ఎలా ఎంజాయ్ చేసేవాడంటే..?
న్యూయార్క్: ఆల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అమెరికా అంటేనే హంజా పళ్లు పటపట కొరుకుతాడని, అసలు ఆ దేశం పేరు చెబితేనే కళ్లెర్ర జేస్తాడని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి అతడు అమెరికా వస్తువులను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అమెరికాకు చెందిన కోకాకోలాను ఉపయోగించడంతోపాటు ఇతర అమెరికా వస్తువులను కూడా వాడుతూ ఎంజాయ్ చేసేవాడట.
హంజా చిన్నవయసులో ఉండగా అఫ్గనిస్థాన్‌లో అతడు ఉంటున్న ఇంటి కాంపౌండ్‌లో చాలా వస్తువులు అమెరికావే కనిపించేవని సమాచారం. ‘ఒసామాకు ముద్దుల కొడుకు అయిన హంజా అమెరికాను అసహ్యించుకుంటాడేమోకానీ, అమెరికా వస్తువులను కాదు. ఎందుకంటే అతడి ఇంటి కాంపౌండ్‌లో ఎప్పుడూ కోకాకోలావంటి వస్తువులు కనిపిస్తుండేవి’ అని హంజా చిన్ననాటి స్నేహితుడు అబ్దురహమాన్ ఖాదర్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అతడు మూడేళ్లు హంజాతో కలసి ఉన్నాడు. సాధారణంగా ఇంట్లోకి అలాంటి వస్తువులను అనుమతించేవారు కాదని, కానీ హంజా మాత్రం ప్రతి రోజు వాటిని దొంగచాటుగా తెప్పించుకునే వాడని అతడు తెలిపాడు. అమెరికాకు చెందిన పొగాకు ఉత్పత్తులను కూడా అతడు తొమ్మిదేళ్ల ప్రాయంలో తీసుకొచ్చేవాడని చెప్పారు.
ఇటీవల లాడెన్ కొడుకు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.