ఆ కుట్రకు వాడింది 'ల్యాప్ టాప్ బాంబ్'
- సోమాలియా విమానం పేల్చివేతకు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించిన ఉగ్రవాదులు
మొగదీషు: సంచలనం రేపిన సోమాలియా విమానం పేల్చివేత యత్నానికి ఉగ్రవాదులు ల్యాప్ ట్యాప్ బాంబు వాడినట్లు తెలిసింది. ల్యాప్ టాప్ లో అమర్చిన బాంబు సెన్సార్లకు చిక్కుండా, ఎక్స్ రేలకు సైతం దొరకకుండా ఉండేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారని, పేలుడు ద్వారా 14 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ధ్వంసం చేయాలని ఉగ్రవాది కుట్రపన్నాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
గత బుధవారం సోమాలియా రాజధాని మొగాదిషు నుంచి జిబౌతికి డాల్లో ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 74 మంది ప్రయాణికులతో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి విమానం ఇంజిన్ సమీపంలో మీటరు వ్యాసంతో రంధ్రం ఏర్పడింది. అయితే.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మొగాదిషు విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. ఈ ఘటనలో విమానం రంధ్రం నుంచి కిందపడి మృతిచెందిన ప్రయాణికుడే బాంబు పేల్చిన ఉగ్రవాది అయి ఉంటాడని దర్యాప్తు అధికారులు అంచనావేస్తున్నారు.
'నిజానికి డాల్లో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించినవారంతా టర్కీ విమానంలో జిబౌతీకి వెళ్లాల్సింది. అయితే వాతావరణం అనుకూలించలికారణంగా టర్కీ విమాన సర్వీసు రద్దయింది. దీంతో 74 మందిని డాల్లో ఎయిర్ లైన్స్ లో పంపించాం. విమానం బయలుదేరటానికి ముందు ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో చేతిలో ల్యాప్ టాప్ పట్టుకుని సంచరించిన వ్యక్తి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితుణ్ని కనిపెట్టగటిగాం. సోమాలియా జాతీయుడైన అతని పేరు అబ్ధుల్లాహి అబ్దిసలాం బోర్లేహ్' అని దర్యాప్తు అధికారులు బుధవారం మీడియాకు వెల్లడించారు.