కోట్ల విలువైన కొండచిలువ చర్మం స్వాధీనం
చైనాః అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువైన కొండచిలువల చర్మాన్ని బీజింగ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాతో సంబంధం ఉన్న 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జంతు చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉండటంతో ఐదు నగరాల్లో దాడులు నిర్వహించిన అధికారులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న కొండచిలువల చర్మాలను పట్టుకున్నారు.
చైనా బీజింగ్ ప్రాంతంలోని హైనాన్ ప్రావిన్స్, ఫ్యూజియన్, గాంగ్సీ నగరాల్లో కొండ చిలువల చర్మాలను స్మగ్లర్లు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు కాపుకాసి దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 318 కోట్ల రూపాయల విలువ చేసే మొత్తం 68,000 చర్మం ముక్కలను స్వాధీనం చేసుకుని, 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు హైనాన్ రాష్ట్ర రాజధాని హైకౌకి చెందిన కస్టమ్స్ అధికారులు తెలిపారు.
జానపద వాయిద్యాల ఉత్పత్తిని చేసే ఓ స్థానిక సంస్థ, అడవి జంతు చర్మాల దిగుమతికి లైసెన్స్ పొందినట్లుగా చెప్పి 2014 సంవత్సరం నుంచే దేశంలోకి అక్రమంగా పైథాన్ చర్మాన్ని దిగుమతి చేసుకుంటోందని స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది. సుమారు 11 మిలియన్ల యువాన్ల పన్నులను ఎగ్గొట్టేందుకు తప్పుడు కస్టమ్స్ డిక్లరేషన్ సమర్పించినట్లు కూడ కంపెనీపై ఆరోపణలున్నాయి. కొండ చిలువలకు రక్షణ కల్పిస్తున్న చైనా ప్రభుత్వం... వాటి చర్మం దిగుమతిని కఠినంగా నియంత్రించడంతోపాటు లైసెన్స్ తప్పనిసరి చేసింది.