ఒకవైపు ఒరిగిన పీసా టవర్
ఇటలీ: ప్రఖ్యాత పీసా టవర్ (బెల్ టవర్) నిర్మాణంపై ఇప్పటివరకు అంతుచిక్కకుండా ఉన్నపలు విషయాలను భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రీ.శ.1173లో నిర్మాణమై, రెండు ప్రపంచ యుధ్దాలకు సాక్షిగా నిలిచిన ఈ భారీ నిర్మాణం ఒకవైపు ఒరిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిర్మాణ దశలోనే ఇది భూమిలోకి కుంగటం ప్రారంభమైందట. పునాదిలో కొంత మెత్తటి భూభాగం ఉండడంతో అలా జరిగిందట.
మొత్తంగా నిర్మాణం పూర్తయ్యే సరికి టవర్ 5.5 డిగ్రీల మేర ఓ వైపుకు ఒరిగింది. పీసాకు అదే ప్రత్యేకత తెచ్చిపెట్టింది. వందల ఏళ్ల చరిత్ర ఒకవైపు, నిర్మాణంలో లోపం ఉన్నా చెక్కు చెదరకుండా వందల ఏళ్లుగా పర్యాటకుల మన్ననలు పొందుతుండటం మరోవైపు పీసాకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌లో స్థానం సంపాదించి పెట్టాయి. కాగా, 1990 నుంచి పదేళ్లపాటు పీసా టవర్ పునరుద్ధరణ పనులు జరిగాయి. టవర్ ఒంపును 5.5 డిగ్రీల నుంచి 3.9 డిగ్రీలకు సరిచేశారు.
నాలుగు భారీ భూకంపాలను తట్టుకుని..
ఎంతో ఆధునిక నిర్మాణ పద్ధతులు పుట్టుకొచ్చిన నేటికాలంలో.. చిన్న పాటి భూ ప్రకంపనలకే భారీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భవనాలు పేకమేడల్లా నేలమట్టం అవుతున్నాయి. అలాంటిది నిర్మాణ లోపంతో ఓ వైపు కుంగిపోయిన పీసా టవర్ ఇప్పటి వరకు 4 భారీ భూకంపాలకు గురైంది. అయినా, చెక్కు చెదరకుండా నిలబడింది. ప్రజలను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6 కి పైగా నమోదైన పరిస్థితులను సైతం తట్టుకొని ఈ టవర్ నిలిచివుండడం పట్ల శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. దీని వెనక గల కారణాలను శోధించడం మొదలుపెట్టారు.
ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలను తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఏ మెత్తటి భూభాగం కారణంగా పీసా టవర్ ఓవైపు ఒరిగిందో.. అదే మెత్తటి మట్టి ఈ నిర్మాణానికి బలాన్ని, భవిష్యత్తును ఇచ్చింది. టవర్ ఎత్తు, దృఢత్వం, పునాది మట్టిలోని మృదుత్వం టవర్‌కు వైవిధ్యమైన లక్షణాలను అందించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మట్టి కారణంగా భూకంప ప్రకంపనలతో ప్రతిబింబించని విధంగా టవర్‌కు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయినీ, వందల ఏళ్లుగా టవర్ దర్జాగా నిలిచివుండడాని కారణమిదేనని వారు వెల్లడించారు. కాగా, మరో 200 ఏళ్లపాటు పీసా టవర్ చెక్కు చెదరకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పీసా అంటేనే ప్రత్యేకం.. ఇప్పుడు అద్వితీయం..!!
Comments
Please login to add a commentAdd a comment