పీసా టవర్‌పై దాడికి కుట్ర!
ప్రపంచ వింతలలో ఒకటైన పీసా టవర్ మీద దాడికి కుట్ర జరిగిదట! ఈ దాడికి కుట్ర పన్నినట్లు చెబుతున్న ట్యునీషియన్ దేశస్థుడిని వెంటనే బహిష్కరిస్తూ ఇటాలియన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బిలెల్ చియాహొయి (26) అనే వ్యక్తి యూరప్‌లో జీహాదీల దాడులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో మెసేజిలు పోస్ట్ చేయడంతో అతడిని అరెస్టు చేశారు. అతడు పీసా టవర్ మీద దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అతడికి జీహాదీ ఉగ్రవాదులతోను, ఐఎస్ఐఎస్‌తోను సంబంధాలున్నట్లు సాక్ష్యాలు లభించడంతో అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఓ జడ్జి ఆదేశించారు. అయితే, దాడి కుట్ర గురించిన ఇతర వివరాలేవీ లభించలేదు. ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం దేశాలలో ఉగ్రవాద దాడులు జరగడంతో.. ఆ తర్వాత ఇటలీలోనే దాడులు జరగొచ్చన్న ఆందోళన ఇప్పటికే ఉంది. దాంతో ఆ దేశ హోం శాఖ మంత్రి యాంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకు కొంతమంది అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి బహిష్కరించారు.