చల్.. చల్.. లే చల్..
మనకు తెలియని కొత్త ప్రదేశానికి వెళ్లాలి.. సెల్‌ఫోన్‌లో జీపీఎస్ ఆధారంగా రూటు కనుక్కుని వెళ్లిపోతాం. జీపీఎస్ లేకుంటే.. అందరినీ రూటు అడిగి.. పోతాం. ఇకపై ఈ రెండింటి అవసరం లేదు. ఇకపై మీ షూయే మీకు రూటు చూపెడుతుంది. చిత్రంలోని బూట్లు అలాంటివే. పేరు లే చల్(అంటే తీసుకెళ్లు అని అర్థం). ఇలాంటి హైటెక్ షూల సృష్టికర్తలు విదేశీయులు కారు.. మనోళ్లే. అదీ ఓ హైదరాబాదీ కంపెనీ వీటిని తయారుచేయడం విశేషం. చిత్రంలోని క్రిస్పియన్ లారెన్స్, అనిరుధ్ శర్మలు 2011లో హైదరాబాద్‌లో డ్యూసీర్ టెక్నాలజీస్‌ను స్థాపించారు. బ్లూటూత్‌తో లింక్ అయిఉండే ఈ షూలు.. లేచల్ యాప్ ఆధారంగా పనిచేస్తాయి.
ఈ యాప్‌ను మనం డౌన్‌లోడ్ చేసుకుంటే.. ఇందులో అడ్రస్ లోడ్ చేస్తే.. గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా అడ్రస్‌ను కనిపెడుతుంది. మనం నడుస్తున్నప్పుడు ఒకవేళ కుడి వైపునకు తిరగాలంటే.. కుడి కాలికి వేసుకున్న షూ వైబ్రేట్ అవుతుంది. అదే ఎడమ వైపునకు తిరగాలంటే.. ఎడమ కాలి షూ వైబ్రేట్ అవుతుందన్నమాట. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్లయిన లారెన్స్, శర్మలు తొలుత వీటిని అంధుల కోసం రూపొందించారట.
ఈ షూలు దారిని కనుక్కోవడానికి ఉపయోగపడటంతోపాటు వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్లుగానూ పనిచేస్తాయి. అంటే.. మనం ఎంత దూరం నడిచాం.. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి వంటి వివరాలను తెలుపుతాయన్నమాట. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రీ ఆర్డర్లను తీసుకుంటోంది. సెప్టెంబర్‌లో దీని ఆవిష్కరణ అనంతరం ప్రపంచవ్యాప్తంగా వీటిని సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. వీటి ధర రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఉండొచ్చు.