ఆ చివరి లైఫ్‌బోట్..
ఆ చివరి లైఫ్‌బోట్..
Published Wed, Apr 20 2016 3:31 AM | Last Updated on Thu, Aug 30 2018 6:04 PM
టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు.. నేనున్నానంటూ పలువురి ప్రాణాలకు భరోసా కల్పిస్తూ.. నౌకలోని చివరి లైఫ్‌బోట్ తన ప్రయాణాన్ని సాగించింది.. మరేమైంది.. మాట నిలబెట్టుకుందా? టైటానిక్‌లాగే మునిగిపోయిందా?
మే 13, 1912..
టైటానిక్ విషాదం జరిగి దాదాపు నెల రోజులు.. ప్రమాద స్థలానికి సరిగ్గా 200 మైళ్ల దూరం.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆర్‌ఎంఎస్ ఓషియానిక్ నౌక నెమ్మదిగా ప్రయాణం సాగిస్తోంది.. అల్లంత దూరంలో సముద్రంలో సగం మునిగి తేలుతున్నట్లు పడవలాంటిది కనిపించింది.. అదేంటో పరిశోధించడానికి ఓషియానిక్ నుంచి కొందరు బయల్దేరారు.. అప్పుడు కనిపించింది వీరికా చివరి లైఫ్‌బోట్.. తనతోపాటు ముగ్గురు అభాగ్యుల మృతదేహాల్ని మోస్తూ.. ఇంతకీ ఈ మధ్యలో ఏం జరిగింది? టైటానిక్ నుంచి పదుల సంఖ్యలో ప్రయాణికులను మోసుకుని బయల్దేరిన ఈ చివరి లైఫ్ బోట్‌కు కూడా టైటానిక్‌కు పట్టిన గతే పట్టిందని తేలింది. బయల్దేరిన కొద్దిసేపటికే.. టైటానిక్‌లాగే ఇది కూడా ఓ మంచు కొండను ఢీకొంది.
పలువురు సముద్రంలో మునిగిపోయారు. షిప్‌నకు చెందిన ఇద్దరు ఫైర్‌మన్లు, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు థాంప్సన్ మృతదేహాలను మాత్రం మోస్తూ.. ఇదలాగే ఉండిపోయింది. బాగా కుళ్లిపోయిన మృతదేహాలు ఓషియానిక్ సిబ్బందికి బోటు అడుగుభాగంలో కనిపించాయి. ఈ చివరి లైఫ్‌బోట్ కు సంబంధించిన అరుదైన చిత్రాలు, మొత్తం ఆపరేషన్‌ను వివరిస్తూ రాసిన పత్రం తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీన్ని ఈ శనివారం బ్రిటన్‌లోని విల్ట్‌షైర్‌లో వేలం వేయనున్నారు. భారీగా ధర పలుకుతుందని అంచనా.
Advertisement