111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ (జలాంతర్గామి) మంగళవారం గల్లంతయ్యింది. అయిదుగురితో బయల్దేరిన జలంతర్గామి అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ప్రముఖ పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త, అతని కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పిపోయిన వారిలో మరో ప్రయాణికుడిని బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్‌గా గుర్తించారు.
కరాచీ ప్రధాన కార్యాలయం కలిగిన ఎంగ్రో కార్పొరేషన్ వైస్ చైర్మన్ షాజాదా దావూద్‌తోపాటు అతని కుమారుడు సులేమాన్ సముద్రంలో తప్పిపోయిన ఓడలో ఉన్నారని వారి కుటుంబం ఓ ప్రకటనలో తెలిపింది. సబ్ మెరైన్ క్రాఫ్ట్‌తో సంబంధాలు తెగిపోయాయని వీటిని పునరుద్ధరించేందుకు, మిస్ అయిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి పలు సంస్థలు, డీప్-సీ కంపెనీలు సంయుక్తంగా రెస్క్యూ ప్రయత్నం జరుపుతున్నాయని తెలిపింది. వారి క్షేమం కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా ఎంగ్రో అనే సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది.
చదవండి: అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. అయితే మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దీంతో తప్పిపోయిన సబ్‌మెరైన్ కోసం.. అమెరికా, కెనడాకు చెందిన కోస్ట్‌గార్డ్, రక్షణ బృందాలు అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
టైటానిక్ మునిగిపోయిన కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్లు (650 కిలోమీటర్లు)దూరంలో 13,000 అడుగుల (4,000 మీటర్లు) నీటి లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్‌లో కోస్ట్‌గార్డ్‌లు గాలిస్తున్నారు. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారు.
1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భారీ నౌక టైటానిక్ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటిక్ సముద్రం దిగువన 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో గుర్తించారు. ఈ షిక్ శకలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్‌లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్న జలాంతర్గామిని వినియోగిస్తోంది. దీని ద్వారా సముద్రం అడుగుకి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూసి రావొచ్చు.
కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.2 కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.
Comments
Please login to add a commentAdd a comment